ఇది ఒక భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్

Fri Mar 17 2023 10:06:54 GMT+0530 (India Standard Time)

Fire Accident in Secunderabad Swapnalok

ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న అగ్నిప్రమాదాలు హైదరాబాద్ వాసుల ప్రాణాల్ని తీస్తున్నాయి. ఇటీవల కాలంలో సికింద్రాబాద్ పరిధిలో చోటు చేసుకుంటున్న భారీ అగ్నిప్రమాదాలు పలువురు ప్రాణాలు తీస్తున్న వైనం తెలిసిందే.తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది. గురువారం రాత్రి వేళలో ప్రఖ్యాత స్వప్నలోక్ కాంప్లెక్స్ లో మొదలైన మంటలు.. పెను అగ్నిప్రమాదంగా మారి ఆరుగురి ప్రాణాల్ని తీశాయి. మంటల్లో చిక్కుకొని.. ఊపిరి ఆడక అస్వస్థతకు గురైన వారు బయటకు వచ్చినా.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారంతా పాతికేళ్ల లోపు వారే కావటం గమనార్హం.మరణించిన ఆరుగురిలో నలుగురు అమ్మాయిలు.. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వీరిలో అత్యధికులు కాల్ సెంటర్ లో పని చేసే వారు కావటం గమనార్హం. అగ్నిప్రమాదం గురించి తెలిసినంతనే సమాచారం అందుకున్న రెస్య్కూటీం స్పందనతో పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ మధ్యనే సికింద్రాబాద్ లోని డెక్కన్ మాల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించగా.. తాజా ప్రమాదంలో ఆరుగురు మరణించటం గమనార్హం.

గురువారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో మంటలు మొదలయ్యాయి.  మొత్తం ఎనిమిది అంతస్తుల్లో ఉన్న ఈభవనంలోని ఏడో అంతస్తులో చోటు చేసుకున్న షార్ట్ సర్క్యుట్ తో మంటలు చెలరేగినట్లుగా చెబుతున్నారు. అవి అంతకంతకూ పెద్దవి అవుతూ.. నాలుగో అంతస్తుకు వ్యాపించాయి. ఐదో అంతస్తులో పేలుడు సంభవించటంతో మంటల తీవ్రత ఎక్కువైంది. ఈ అంతస్తులో వస్త్రదుకాణాలు.. కంప్యూటర్ ఇన్ స్టిట్యూట్.. కాల్ సెంటర్లు.. ప్రభుత్వ.. ప్రైవేటు ఆఫీసులు ఉన్నాయి.

నిత్యం రద్దీగా ఉండే స్వప్నలోక్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగటంతో షాపింగ్ కు వచ్చిన అందరూ హడావుడిగా బయటకుపరుగులు తీశారు. దట్టమైన పొగ.. మంటలు పెరగటంతో కొందరు భవనంలోనే చిక్కుకుపోయారు. దాదాపుగా 15 మంది వరకు భవనంలోనే చిక్కుకుపోయారు. ప్రమాదం గురించి తెలిసిన అగ్నిమాపక శాఖ సిబ్బంది రంగంలోకి దిగి.. అతి కష్టమ్మీదా అందరిని కాపాడే ప్రయత్నం చేశారు. భారీ క్రేన్ల సాయంతో బిల్డింగ్ లోకి వెళ్లి రెస్క్యూ చేశారు. అయితే పలువరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అలా తరలించిన వారిలో ప్రమీల (22) వెన్నెల (22) శ్రావణి (22) త్రివేణి (22) శివ (22)లు మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. మరో యువకుడు ప్రశాంత్ (23) అపోలో ఆసుపత్రిలో మరణించాడు. మరణించిన నలుగురు అమ్మాయిలు బీఎం5 కాల్ సెంటర్ లో ఉద్యోగులుగా పని చేస్తున్నారు.

స్వప్నలోక్ కాంప్లెక్స్ మొత్తం రెండు బ్లాకుల్లో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో 400 వరకు షాపులు ఉన్నాయి. ఉదయం 10 గంటలకు మొదలయ్యే రద్దీ రాత్రి పది గంటల వరకు సాగుతూనే ఉంటుంది. ఈ కాంప్లెక్స్ లో దాదాపు మూడు వేల మంది వరకు పని చేస్తుంటారు. వేలాది మంది ప్రజలు ఈ కాంప్లెక్స్ ను నిత్యం సందర్శిస్తుంటారు. సెల్లార్ గ్రౌండ్ మొదటి అంతస్తుల్లో 170 షాపులు ఉన్నాయి. మంటలు అంటుకునే సమయానికి ఐదు..ఆరు.. ఏడు అంతస్తుల్లోని చాలా ఆఫీసుల్లోని ఉద్యోగులు వెళ్లిపోవటంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. భారీ ప్రాణ నష్టం జరగలేదు.

గురువారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో మొదలైన మంటలు కాసేపటికే పెద్దవిగా మారాయి. రాత్రి పది గంటల ప్రాంతంలో వర్షం పడటం.. అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలతో మంటలు అదుపులోకి వచ్చినా.. దట్టమైన పొగ అలుముకోవటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. బాధితుల్ని కాపాడే క్రమంలో కానిస్టేబుల్ రవితో పాటు మరికొందరు అస్వస్థతకు గురయ్యారు.  ప్రాణాలకు తెగించి.. భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చినప్పటికీ ఆరుగురు మరణించటం మాత్రం కలిచివేసింది.    నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.