Begin typing your search above and press return to search.

గుడిలోకి వచ్చారనిదళిత చిన్నారికి ఫైన్‌...

By:  Tupaki Desk   |   23 Sep 2021 10:30 AM GMT
గుడిలోకి వచ్చారనిదళిత చిన్నారికి ఫైన్‌...
X
కర్నాటకలో వివక్ష ఇంకా కొనసాగుతున్నదని చెప్పడానికి కొప్పాల్‌ జిల్లాలో జరిగిన సంఘటనను ఉదాహరణంగా చెప్పుకోవచ్చు. రెండేండ్ల బాలుడు గుడిలోకి వచ్చాడని ఆ కుటుంబానికి అగ్రవర్ణాలు రూ.25 వేల జరిమానా విధించారు. పిల్లాడి పుట్టినరోజున దేవుడ్ని దర్శించుకునేందుకు వెళ్లామని, దేవుడ్ని దర్శించుకునే అవకాశం ఇంకా మాకు రావడం లేదని ఆ దళిత కుటుంబం కన్నీరుమున్నీరవుతున్నది.

కర్నాటక కొప్పాల్‌ జిల్లాలోని మియాపూర్‌ గ్రామంలో ఓ దళిత కుటుంబానికి చెందిన రెండేండ్ల బాబు పుట్టినరోజున గ్రామంలోని గుడికి వెళ్లి దర్శించుకోవాలనుకున్నారు. గుడిని చూడగానే పిల్లాడు వెంటనే పరుగెత్తుకెళ్లాడు. దాంతో ఆలయం అపవిత్రమైందంటూ గుడి పూజారులు, గ్రామంలోని అగ్రవర్ణాల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాన్ని శుద్ధి చేసేందుకు రూ.25 వేలు ఖర్చవుతున్నందున, ఆ మొత్తం జరిమానాగా చెల్లించాలని దళిత కుటుంబాన్ని ఆదేశించారు. ఈ విషయం తెలియగానే అధికారులు వెంటనే గ్రామానికి వచ్చి ఇరుపక్షాల వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు.

నా కొడుకు పుట్టినరోజున గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రార్థనలు చేయాలనుకున్నాం. అప్పుడే వర్షం కురియడంతో మా కుమారుడు ఒక్కసారి ఆలయంలోకి పరుగెత్తుకెళ్లాడు. దాంతో గుడి అపవిత్రం అయిందని అగ్రవర్ణాలు మాకు జరిమానా విధించాయి. అన్యాయమని మొత్తుకున్నా వినలేదు’ అని రెండేండ్ల చిన్నారి తండ్రి చంద్రు చెప్పారు. గ్రామంలో శాంతి, సామరస్యానికి విఘాతం కలుగకుండా ఉండేందుకు చంద్రు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి నిరాకరించడం విశేషం.

దేశవ్యాప్తంగా ఇప్పటికీ చాలాచోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఓవైపు దేశం అత్యాధునిక ఆవిష్కరణలు,టెక్నాలజీలో దూసుకుపోతుంటే... మరోవైపు ఇప్పటికీ కుల జాఢ్యం దేశాన్ని పట్టి పీడిస్తూనే ఉంది.ముఖ్యంగా దళితులపై వివక్ష ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.ఇటీవల వినాయక చవితి సందర్భంగా పలుచోట్ల దళితులపై దాడులు జరిగిన ఘటనలు వెలుగుచూశాయి