లీనా మణిమేఖలై మరో పోస్టర్.. మొన్న కాళీకి సిగరెట్.. నేడు శివపార్వతులకు..

Thu Jul 07 2022 17:00:01 GMT+0530 (IST)

Film Director Leena Manimekalai controversy poster

కాళిమాత స్మోకింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఫిల్మ్ డైరెక్టర్ లీనా మణిమేఖలై సృష్టించిన ఈ వివాదం ముగియకముందే ఆమె మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇది కూడా వివాదంగా ఉండడంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. లీనా షేర్ చేసిన పోస్టులతో సోషల్ మీడియాలోనే కాకుండా రాజకీయకంగా కూడా ప్రకంపనలు రేపుతోంది. ఆమె ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారని బీజేపీ నాయకులు షాజాద్ పూనావల్లా ఆరోపించారు. అంతేకాకుండా ఆమెకు కాంగ్రెస్ టీఎంసీలు మద్దతు ఇస్తున్నాయని అంటున్నారు. ఇదిలా ఉండగా లీనా మణిమేఖలై మాత్రం తాను షేర్ చేసిన పోస్టులను సమర్థించుకుంటుంది. అయితే ట్విట్టర్ మాత్రం ‘కాళి’ ట్వీట్ ను తొలగించింది.తాజాగా లీనా షేర్ చేసిన పోస్టు హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని పలువురు హిందూధర్మ నాయకులు పేర్కొంటున్నారు. ఈ పోస్టర్ లో శివుడు పార్వతి వేషధారణలో ఉన్న వాళ్లు సిగరెట్లు తాగుతూ కనిపించారు. ఈ ఫోటోను లీనా నెట్టింట్లో షేర్ చేయడమే కాకుండా ‘మరెక్కడో’ అని ట్యాగు ఇచ్చింది. దీంతో ఈ ట్యాగ్ పై రాజకీయంగా దుమారం లేపినట్లయింది. గతంలో కాళి మాత చేతిలో సిగరెట్ ఫోటోను షేర్ చేసిన ఆమెపై ఇప్పటికీ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఆ వివాదం ముగియకముందే లీనా మరో ఫొటో పెట్టి సంచలనంగా మారారు.

తమిళనాడులోని మారుమూల గ్రామానికి చెందిన లీనా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. మధురైకి దక్షిణాన ఉన్న మారుమూల గ్రామం మహారాజపురంలో ఆమె జన్మించారు. ఆమె తండ్రి లెక్చరర్. ఆమె గ్రామంలో ఆచార సాంప్రదాయాల పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. ఇందులో భాగంగా యుక్త వయసు రాగానే పెళ్లి చేసేస్తారు. అలా లీనాకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. దీంతో ఆమె ఎవరికీ చెప్పకుండా చెన్నై పారిపోయారు. ఆ తరువాత ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐటీ రంగాల్లో ఉద్యోగాలు కూడా చేశారు.

అయితే ఆమెకు సినిమా ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. అందుకే సినిమా నిర్మాతగా మారారు. ఓ డాక్యుమెంటరీ చిత్రీకరిస్తున్న సమయంలో అందులోని ఈ పోస్టర్లను లీనా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే హిందువులకు వ్యతిరేకంగా ఈ పోస్టర్లు ఉండడంతో దేశ వ్యాప్తంగా వివాదం రాజుకుంది. కొన్ని రాష్ట్రాల్లో ఆమెపై ఫిర్యాదులు ఇవ్వడంతో కేసులు కూడా నమోదయ్యాయి. మతపరమైన వివాదాలు సృష్టించే విధంగా ఈ పోస్టర్ ఉందని ఢిల్లీ ముంబయ్ యూపీల్లో ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.

లీనా మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఓ ట్వీట్ చేశారు. అదిప్పుడు వైరల్ గా మారింది. 2013లో ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ‘నా జీవిత కాలంలో మోదీ ఈ దేశానికి ప్రధాని అయితే నా పాస్ పోర్ట్ రేషన్ కార్డ్ పాన్ కార్డ్ తో పాటు పౌరసత్వాన్ని సరౌండర్ చేస్తాను’  అని పేర్కొంది. అయితే ఆ సమయంలో వివాదం రేగడంతో ఆమె ట్వీట్ ను ట్విట్టర్ తొలగించింది. ఇప్పుడు తాజాగా ఆమె ఇలాంటి పోస్టర్లలో వివాదాస్పదంగా ఉన్న ‘కాళి’ ట్వీట్ ను తొలగించింది.

-‘కాళి పోస్టర్’ ట్వీట్ ను తొలగించిన ట్విట్టర్

డైరెక్టర్ లీనా మణిమేకలై ‘కాళి’ సినిమా పోస్టర్ ను ట్విట్టర్ తొలగించింది. హిందూ దేవత పొగతాగుతున్నట్లు ఉన్న ఈ పోస్టర్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.  కాగా తన ట్వీట్ తొలగింపుపై మణిమేకలై కూడా స్పందించారు. ‘2 లక్షల మంది ద్వేషపూరిత ప్రేరేపకుల ట్వీట్ లను ట్విట్టర్ ఇండియా తొలగిస్తుందా? ’ అని ఆమె ప్రశ్నించింది. కొందరు హిందూ దేవతల గెటప్ వేసుకొని పొగతాగుతున్న ఫొటోలను ఆమె పోస్టు చేసింది.