Begin typing your search above and press return to search.

ఏడు కిలోమీటర్లు.... మూడు గంటలు... దటీజ్ ఎన్టీయార్

By:  Tupaki Desk   |   28 May 2023 5:30 PM GMT
ఏడు కిలోమీటర్లు.... మూడు గంటలు... దటీజ్ ఎన్టీయార్
X
ఎన్టీయార్ క్రేజ్ ఎలా ఉందో చెప్ప ఉదాహరణలు చాలానే చరిత్ర పుటలలో భద్రంగా ఉన్నాయి. ఎన్టీయార్ రాజకీయ మధనం అన్నది 1982 కి కొన్నేళ్ళ ముందే సాగుతూ వచ్చింది. ఆయన అరవై ఏళ్ళు వచ్చేస్తే ఏమి చేస్తారు అని చాలా మంది ఆలోచించేవారు. ఆయన ఆధ్యాత్మిక చిత్రాలు తీస్తారని, ప్రముఖుల జీవిత చరిత్రలు తీస్తారని అనుకునేవారు. అయితే ఎన్టీఆర్ మాత్రం అరవైలో ఇరవైని చూసారు.

తాను వయసుని లెక్క చేయకూడదని తనకు ఇన్ని అవకాశాలు ఇచ్చిన ప్రజలకు న్యాయం చేయాలని భావించి రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. ఆ ఆలోచనను తన సన్నిహితులతో పంచుకున్నారు. అయితే చాలా మంది దాన్ని ప్రోత్సహించలేదు. వద్దు మీకు ఈ రాజకీయాలు. మీ ముక్కుసూటి తనానికి అవి తగవని కూడా పెట్టేశారు.

అయినా సరే ఎన్టీయార్ ఆలోచనలు మానలేదు. ఆయన ఆలోచనలకు కొంత ఊతమిచ్చిన వారు ప్రముఖ పాటల రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి. రాజకీయాల్లోకి వెళ్ళండి అని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా 1983 మార్చి 28 తరువాత తాను సినిమాలకు నెలలో సగం రోజులే కేటాయిస్తాను అని ఎన్టీయార్ సర్ధార్ పాపారాయుడు సినిమా షూటింగులో ఒక ప్రకటన చేశారు.

అది చిన్న వార్తగా వచ్చినా తెలుగు రాష్ట్రాలనే అతి పెద్ద రాజకీయ తుపానుగా ముంచెత్తింది. ఎన్టీయార్ ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేసరికి మూడు బస్తాల నిండా అభిమానులు రాసిన ఉత్తరాలు ఉన్నాయి. వారంతా రాజకీయాల్లోకి రండి అంటూ అందులో కోరడంతో రామారావు తన నిర్ణయాన్ని ఇంకా గట్టి పరచుకున్నారు.

దీనికంటే ముందు మరో ముచ్చట జరిగింది. అదేంటి అంటే ఎన్టీయార్ కి భవననం వెంకటరాం మిత్రుడు. ఆయన కాంగ్రెస్ సీఎం గా ప్రమాణం చేసినపుడు హైదరాబాద్ రాజ్ భవన్ కి ఆయన వచ్చారు అక్కడ మాజీ మంత్రి నాదెండ్ల భాస్కరరావుతో పరిచయం ఏర్పడింది. నాదెండ్ల కొత్త పార్టీ పెట్టాలని చూస్తున్నారు. ఎన్టీయార్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. అలా పెరిగిన ఇద్దరి పరిచయం కాస్తా ఎన్నో భేటీల తరువాత తెలుగుదేశం పార్టీకి అంకురార్పణం జరిగింది.

అది 1982 మార్చి 29 హైదరాబాద్ కి మద్రాస్ నుంచి ఎన్టీయార్ వస్తున్నారు. ఆ విషయం తెలిసి బేగం పేట ఎయిర్ పోర్టు అంతా అభిమానులతో కిటకిటలాడింది. ఇక ఎంటీయార్ బేగం పేట ఎయిర్ పోర్టు నుంచి నాదెండ్ల భాస్కరరావు ఇంటికి వెళ్లడానికి జస్ట్ ఏడు కిలోమీటర్ల దూరం ఉంటే చేరుకోవడానికి మూడు గంటల టైం పట్టింది. అంతలా అభిమాన జనం స్వాగతాలతో ఎన్టీయార్ ర్యాలీ సాగి కొత్త రికార్డు ని ఆ రోజుల్లో సృష్టించింది అని చెప్పాలి.

నాదెండ్ల ఇంట్లో తెలుగుదేశం సారధ్య సంఘం సభ్యులు అంతా తెలుగుదేశం పార్టీకి ఎన్టీయార్ ని ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. అదే రోజు మధ్యాహ్నం ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద విశేష అభిమానులను ఉద్దేశించి ఎన్టీయార్ ప్రసంగిస్తూ తెలుగు వాడిని తాను అన్నారు. తనది తెలుగు దేశం పార్టీ అని ప్రకటించారు. ఆ తరువాత కొద్ది రోజుల వ్యవధిలోనే అంటే ఏప్రిల్ 11న నిజాం కళాశాల మైదానంలో టీడీపీ మొదటి మీటింగ్ పెడితే జనాలు తండోపతండాలుగా వచ్చారు.

అలా ఆ మీటింగ్ సూపర్ సక్సెస్ అయింది. దాంతో ఉమ్మడి ఏపీలో మూడు మీటింగ్స్ టీడీపీ తరఫున నిర్వహించారు. అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక దీంతో ఆగని ఎన్టీయార్ చైతన్య రధం వేసుకుని ఉమ్మడి ఏపీ అంతా తొమ్మిది నెలల పాటు తిరిగారు. జనాలలో చీతన్యం తెచ్చారు. ఆయన ఆ టైం లోనే ఎన్నికల హామీలు ఇచ్చుకుంటూ వెళ్లారు. అలా పుట్టినదే కిలో రెండు రూపాయలకే చౌక బియ్యం. దాన్ని ఆనాటి కాంగ్రెస్ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి అమలు చేసినా జనాలు ఎన్టీయార్ నే గెలిపించారు

ఆ విధంగా తనకంటూ ఒక నినాదం విధానంతో ఎన్టీయార్ ఏపీ అంతా తిరిగారు. మొత్తం మీద చూస్తే ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ 1983లో జరిగిన ఎన్నికల్లో కొత్త రికార్డులు సృష్టించి 202 సీట్లను సాధించింది. ఎన్టీయార్ పార్తీ పెట్టిన తొమ్మిది నెలలలోనే సీఎం అయ్యారు. ఆయన మీద వెన్నుపోటు కుట్రలు 1984లో జరిగినా ఎదుర్కొని మళ్లీ సీఎం అయ్యారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కూడా ఇందిరాగాంధీ హత్యానంతర సానుభూతిని పక్కకు నెట్టి మరీ 200 సీట్లకు పైగా సాధంచి మూదవసారి సీఎం అయ్యారు.

అలా ఎన్టీయార్ 1983, 1984, 1985లలో వరసగా మూడు సార్లు సీఎం గా ప్రమాణం చేయడం విశేషం. ఆయన జీవితంలో నాలుగు సార్లు సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. మొత్తం ఏడున్నరేళ్ల పాటు పాలించారు. ఎన్నో పాలన సంస్కరణలు అమలు చేశారు.