సమాజంలో మోసాలు చేసేవారు ఎక్కువైపోయారు. అనేక రకాల పద్ధతుల్లో మోసం చేస్తున్నారు. ఈ మోసగాళ్ల బారిన సామాన్య ప్రజలే కాకుండా ప్రభుత్వ అధికారులు సైతం పడుతున్నారు. తాను ముఖ్యమంత్రి కార్యాలయం లేదా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని.. కొద్ది రోజుల్లో రాష్ట్ర పర్యటనకు వస్తున్నామని.. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఫేక్ కాల్స్ చేస్తున్నారు. లేదా తమ బంధువులకు మీరున్న ప్రాంతాల్లో కొంత డబ్బు అవసరమైందని మీరు ఇస్తే ఆ తర్వాత తాను సెటిల్ చేస్తానంటూ మోసగాళ్లు ఫేక్ కాల్స్ చేస్తున్నారు.
ఇప్పుడు ఇలాగే ఒక వ్యక్తి తాను ప్రధానమంత్రి కార్యాలయం అధికారినంటూ పక్కా మోసం చేశాడు. తాను జమ్ముకశ్మీర్ పర్యటనకు వస్తున్నానని.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలని కోరడంతో ఆ రాష్ట్ర అధికారులు ముందూ వెనుకా చూసుకోకుండా జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించేశారు. ఇంకేముందు ఆ జెడ్ ప్లస్ కేటగిరీతో ఆ వ్యక్తి మంచు పర్వతాల్లో ఎంచక్కా విహరించాడు. అంతేకాకుండా పీఎంవో అధికారినని చెప్పుకుంటూ అధికార దర్పాన్ని ప్రదర్శించాడు. ఏకంగా జమ్ము కశ్మీర్ అధికారులతో సమావేశం కూడా ఏర్పాటు చేశాడు. ఇతడు ఇలా మోసం చేయడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికే రెండుసార్లు ఇలా మోసం చేశాడు. ఇప్పుడు ఇది మూడోసారి కావడం గమనార్హం.
ఈ మోసగాడి వివరాల్లోకి వెళ్తే.. ఈ మోసగాడి పేరు.. కిరణ్ భాయ్ పటేల్. గుజరాత్ లోని అహ్మదాబాద్ అతడి ఊరు. దీంతో ప్రజలను మోసం చేయడానికి తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారినంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నానని చెప్పుకుంటున్నాడు. గుజరాత్ కు చెందిన ఐఏఎస్ అధికారినని చెప్పుకోవడం పైగా ప్రధాని మోదీ కార్యాలయంలోనే పనిచేస్తుండటంతో జమ్ముకాశ్మీర్ పోలీసులు అతడిని మోసగాడని గుర్తించలేకపోయారు.
జమ్ముకశ్మీర్ పర్యటనలో కిరణ్ పటేల్ కు పోలీసులు జెడ్ ప్లస్ కేటగిరీతో భద్రత కల్పించారు. దీంతో అతడు అత్యంత సమస్యాత్మక సున్నిత ప్రాంతాల్లోనూ తిరిగాడు. జమ్మూ కాశ్మీర్ లో భారత్–పాకిస్తాన్ ను వేరు చేసే లైన్ ఆఫ్ కంట్రోల్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలను అతడు కలియతిరిగాడు. ఇలా రెండుసార్లు జమ్ము కశ్మీర్ పర్యటనకు వచ్చి కిరణ్ పటేల్ సకల రాజభోగాలు అనుభవించాడు. మూడోసారి కాశ్మీర్ పర్యటనకు వచ్చినప్పుడు అడ్డంగా దొరికిపోయాడు.
శ్రీనగర్ లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న కిరణ్ భాయ్ పటేల్ ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. అతyì పైన చీటింగ్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. అతనిపై మార్చి 2న చీటింగ్ ఫోర్జరీ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మార్చి 3న కిరణ్ పటేల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కిరణ్ భాయ్ పటేల్ ఎలా దొరికిపోయాడంటే.. రాష్ట్రాలకు అందే ప్రొటోకాల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో పని చేసే అధికారులు ఎవరైనా ఆయా రాష్ట్ర పర్యటనలకు వస్తుంటే ముందుగానే స్థానిక పోలీసులతోపాటు విమానాశ్రయం అధికారులకు సమాచారం వెళ్తుంది. ఈ నేపథ్యంలో కిరణ్ పటేల్ వస్తున్నట్టు జమ్ము కాశ్మీర్ రాష్ట్ర అధికారులకు కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో అక్కడి అధికారులకు అనుమానం బలపడింది. దీంతో కిరణ్ పటేల్ బస చేసిన హోటల్ కు వెళ్లిన పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.