Begin typing your search above and press return to search.

మాయదారి రోగానికి ప్రైవేటు రేట్లు ఫిక్స్ చేసిన ఫిక్కీ

By:  Tupaki Desk   |   5 Jun 2020 4:00 AM GMT
మాయదారి రోగానికి ప్రైవేటు రేట్లు ఫిక్స్ చేసిన ఫిక్కీ
X
మాయదారి రోగం అంతకంతకూ విస్తరిస్తోంది. లాక్ డౌన్ వేళలో.. పరిమితంగా వచ్చే పాజిటివ్ కేసులకు భిన్నంగా.. ఇప్పుడు దేశంలో రోజురోజుకి నమోదవుతున్న కేసుల తీవ్రత పెరిగిపోతోంది. లాక్ డౌన్ ఎత్తేసిన నాటి నుంచి రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగి పోతోంది. గురువారం ఒక్కరోజులో దేశంలో పాజిటివ్ కేసుల విషయంలో కొత్త రికార్డు నమోదైంది. ఏకంగా పదివేల వరకూ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో ఇన్ని పాజిటివ్ కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి.

కేసుల నమోదు పెరిగిపోతున్న వేళ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయటం రానున్న రోజుల్లో మరింత కష్టం కానుంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం తప్పని పరిస్థితి. ఇలాంటివేళ.. పాజిటివ్ రోగులకు ఎంత ఛార్జ్ చేయాలి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దేశంలోని అన్ని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రులతో కూడిన ఫిక్కీ కోవిడ్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్సు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో మాయదారి రోగానికి చికిత్స చేసేందుకు ఎంత ఛార్జ్ చేయాలన్న దానిపై స్పందించింది. ఏ చికిత్సకు ఎంతన్నది ఫిక్స్ చేసింది.

దీనితో కొన్ని షరతుల్ని విధించారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన పేషెంట్లకు ఐసోలేషన్ వార్డులో చికిత్సకు రూ.13,600 వసూలు చేయాలని నిర్ణయించారు. అదే వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో చికిత్సకు రూ.27,088.. అదే వెంటిలేటర్ తో సహా ఐసీయూ చికిత్సకు రూ.36,853 ఛార్జ్ చేయాలని డిసైడ్ అయ్యారు. అదే సొంతంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవాలనుకునే వారికి కాస్త ఎక్కువగానే ఛార్జీలు ఫిక్స్ చేయటం గమనార్హం.

సొంతంగా ఐసోలేషన్ వార్డుల్లో చికిత్సకు రూ.17వేలు.. వెంటిలేటర్ లేకుండా ఐసీయూ చికిత్సకు రూ.34వేలు.. వెంటిలేటర్ తో సహా ఐసీయూలో చికిత్సకు రూ.45వేల మొత్తాన్ని చార్జీలుగా ఫిక్స్ చేశారు. ఇక.. ఇన్య్సురెన్సులో భాగంగా చికిత్స చేసే వారికైతే.. ఐసోలేషన్ వార్డులోచికిత్సకు రూ.20వేలు.. వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో చికిత్సకు రూ.55వేలు.. వెంటిలేటర్ తో సహా ఐసీయూలో చికిత్సకు రూ.68వేలుగా నిర్ణయించారు. ఈ ధరల లెక్క చూస్తే.. రానున్న రోజుల్లో బీమా కంపెనీలకు షాకింగ్ గా మారనున్నాయని చెప్పక తప్పదు.