ఈఫీఎఫ్ చందాదారుల తీవ్ర నిరాశం.. ఆ సమస్య ఎన్నటికి తీరేనో..?

Sat Jan 29 2022 18:00:01 GMT+0530 (India Standard Time)

Extreme frustration of EPF subscribers

ఉద్యోగులకు ఈపీఎఫ్ కష్టాలు తప్పడం లేదు. ప్రతీ సమస్యకు ఓ పరిష్కారం కనుగొన్నప్పటికీ మరో కొత్త సమస్య తయారవుతోంది. అంతకుముందు ఈపీఎఫ్ లోని డబ్బులు డ్రా చేసుకునేందుకు ఉద్యోగులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తమ డబ్బులు తీసుకునేందుకు సంస్థల నుంచి తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం డబ్బులు డ్రా చేసుకునేందుకు పనిచేసే సంస్థతో సంబంధం లేకుండా ఆన్లైన్ ద్వారా డబ్బులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు ఉద్యోగులు ఈ ఆన్లైన్ ద్వారా కూడా కష్టాలు పడుతున్నారు.గత నెలరోజులుగా ఈపీఫ్ పోర్టల్ లో సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఈపీఎఫ్ ద్వారా ఏదైనా అవసరం ఉన్నవారు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. వేతన జీవులు కార్మికులు ఈపీఎఫ్ సేవలు పొందలేకపోతున్నారు. అత్యవసరంగా డబ్బు డ్రా చేసుకుకోవాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి నిర్మాణం చికిత్సలు పిల్లల ఉన్నత చదువుల కోసం నగదు అవసరమున్నవారు ఈపీఎఫ్ తీసుకునేందుకు యత్నించగా వెబ్ సైట్ ఓపెన్ కావడం లేదు. ఒకవేళ ఓపెన్ అయినా స్లోగా మూవ్ కావడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు.

మరోవైపు ఇటీవల ఈ- నామినేషన్ తప్పని సరి చేయడంతో ఉద్యోగులుకార్మికులు ఆ ప్రక్రియలో మునుగుతుండగా సర్వర్ బిజీగా మారుతోంది. ఒకేసారి లక్షల మంది దీనిని ఓపెన్ చేయడంతో వెబ్ సైట్ తరుచూ మొరాయిస్తోంది. దాదాపు ఏడు కోట్ల మంది చందాదారుల్లో 52 లక్షల మందివి మాత్రమే ఈ నామినేషన్ పూర్తయింది. మిగతా వారు రోజుల తరబడి ప్రయత్నిస్తున్నా సర్వర్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. వెబ్ సైట్ ఓపెన్ చేసినా లాగిన్ కాకపోవడం తీవ్ర ఇబ్బందులను తెస్తోంది.

ఒకవేళ ఎంతో కష్టపడిన తరువాత పేజీ ఓపెన్ అయినా వివరాలు నమోదు చేసిన వెంటనే సర్వర్ డౌన్ అవుతోంది. ఇక ఈ నామినేషన్ కు ఈ సిగ్నేచర్ అవసరమవుతోంది. దీంతో సీ-డాక్ నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాగా డబ్బు అవసరమున్నవారు ప్రక్రియ మొదలు పెట్టగానే ఈ-నామినేషన్ తప్పనిసరి చేయడంతో చందాదారులు నిరాశ చెందుతున్నారు. దీంతో సరైన సమయానికి నగదు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గత డిసెంబర్ 31 వరకు ఈ నామినేషన్ పూర్తి చేసుకోవాలని సూచించినా సమాచారం అందుబాటులో లేకపోవడంతో దానిని ఎవరూ చేసుకోలేకపోయారు. దీంతో గడవు తరువాత కూడా ఈ నామినేషన్ కు అవకాశం ఇవ్వడంతో కొందరు ఇప్పుడు ఆ ప్రక్రియ చేపడుతున్నారు. దీంతో సర్వర్ పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఫలితంగా ఇతర అవసరమున్నవారికి పోర్టల్ ఓపెన్ కావడం లేదు. ఒకవేళ ఈ నామినేషన్ చేయాలనుకున్నా అందుకు సహకరించడం లేదు.

అయితే ఈ సమస్యపై ఇప్పటికే చందాదారులు పలుసార్లు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు ఐటీ అధికారులతో మాట్లాడుతున్నామని చెబుతున్నప్పటికీ సరైన చర్యలు తీసుకోవడం లేదు. గత నెల రోజులుగా ఇదే సమస్య ఉండడంతో ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడో అని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నామినేషన్ పూర్తి చేస్తేనే ఇతర పనులకు అవకాశం ఇవ్వడంతో చందాదారులు దానిమీదే దృష్టి పెడుతున్నారు. కానీ సర్వర్ మాత్రం పనిచేయడం లేదని వాపోతున్నారు.