Begin typing your search above and press return to search.

అడుక్కుతినేవాళ్లు కూడా ఈ చీరలు కట్టరు.. బతుకమ్మ చీరల కాల్చివేత

By:  Tupaki Desk   |   28 Sep 2022 10:34 AM GMT
అడుక్కుతినేవాళ్లు కూడా ఈ చీరలు కట్టరు.. బతుకమ్మ చీరల కాల్చివేత
X
తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు అందజేస్తున్న బతుకమ్మ చీరలపై మహిళల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. బతుకమ్మ చీరల పేరుతో నాసిరకం చీరలు పంపిణీ చేస్తున్నారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా పండుగకు ఇటువంటి చీరలు కట్టుకుంటారా? అంటూ నిప్పులు చెరుగుతున్నారు.

ఇంకా కొన్ని చోట్ల అయితే బతుకమ్మ చీరలను తగలబెడుతున్న మహిళలు కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలంలో బతుకమ్మ చీరలను మహిళలు దగ్ధం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో నడిరోడ్డుపై బతుకమ్మ చీరలను తగులబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇక ఒక మహిళ అయితే కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగింది. రోజువారీ కూలీ పని చేసుకున్నప్పటికీ తాము మంచి చీరలు కట్టుకుంటామని.. కానీ పండుగకు ఇటువంటి నాసిరకం చీరలు ఎందుకు పంపిణీ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి చీరలు కేసీఆర్ భార్య, కూతురు కవిత కట్టుకుంటుందా? చెప్పాలని నిలదీశారు. వాళ్లు కట్టుకుంటే మేం కట్టుకుంటామని పేర్కొన్నారు.

అడుక్కుతినే వాళ్లు కూడా ఈ చీరలు కట్టుకోరని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మహిళలను కేసీఆర్ తన అహంకారంతో అగౌరవపరుస్తున్నారని.. మహిళలకు నాసిరకం చీరలు ఇచ్చి పండుగ చేసుకోమని చెబుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోను షేర్ చేసి ఎండగట్టింది. తెలంగాణ సీఎంవోకు, టీఆర్ఎస్ పార్టీకి ట్యాగ్ చేసి బతుకమ్మ చీరల పేరుతో మీరు చేస్తున్న నిర్వాకం ఇదీ అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది.

ఇక బతుకమ్మ చీరలు తగలబెడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. ఇష్టం లేకపోతే మహిళలు తీసుకోవద్దని.. ఒకవేళ ఎవరైనా తగలబెడితే మాత్రం ఊరుకోమన్నారు. చీరలు కాల్చేవారు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా తీసుకోకుండా ఉండాలని వారికి స్పష్టం చేశారు.

ప్రభుత్వం హెచ్చరించినా కూడా మహిళలు మాత్రం బతుకమ్మ చీరల విషయంలో తమ అసంతృప్తిని వెల్లగక్కుతూనే ఉన్నారు. చీరలను కాల్చేస్తున్న ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.