Begin typing your search above and press return to search.

ఫ్రాన్స్‌ లో మళ్లీ కరోనా విజృంభణ మొదలు ...లాక్‌డౌన్ ప్రకటించిన అధ్యక్షుడు !

By:  Tupaki Desk   |   29 Oct 2020 5:45 AM GMT
ఫ్రాన్స్‌ లో మళ్లీ కరోనా విజృంభణ మొదలు ...లాక్‌డౌన్ ప్రకటించిన అధ్యక్షుడు !
X
దేశంలో కరోనా మళ్లీ చెలరేగిపోతుండడంతో ఫ్రాన్స్ మళ్లీ లాక్‌ డౌన్ అమలు చేసింది. పరిస్థితి పూర్తిగా చేయి దాటకముందే చర్యలు చేపట్టాలని భావించిన ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తాజాగా లాక్ ‌డౌన్ ప్రకటించారు. డిసెంబరు 1 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ మొదలైందని, మొదటి దశ కంటే ఇది మరింత ప్రమాదకరంగా ఉంటుందని, కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు. రాజధాని నగరం పారిస్‌ సహా ఇతర ప్రధాన పట్టణాల్లో రెండువారాల క్రితమే కర్ప్యూ విధించినా కరోనా కేసుల ను కట్టడి చేయలేకపోయామని, సెకండ్‌వేవ్‌లో ఇప్పటికే దేశంలో 35 వేలకు పైగా కరోనా మరణాలు సంభవించాయని తెలిపారు.

లాక్‌ డౌన్‌ నిబంధనల నేపథ్యంలో గురువారం రాత్రి నుంచి బార్లు, రెస్టారెంట్లు, అత్యవసరాలు మినహా మిగతా వ్యాపార సంస్థలన్నీ మూసివేయాలని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి రాతపూర్వక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని మాక్రాన్‌ చెప్పారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు ఈ సందర్భంగా మరోసారి విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌-19 వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో ఆర్థిక కార్యకాలపాలకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటామని, వ్యాపార వర్గాలను ఆదుకునేందుకు అదనపు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు.

ఇప్పటికైనా జాగ్రత్త పడకుంటే 4 లక్షలకు పైగా మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. వచ్చే నెల 15 నాటికి దాదాపు 9 వేల మందికి ఐసీయూలో చేర్పించి చికిత్స అందించాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉందన్నారు.ఒకవేళ లాక్‌డౌన్‌ విధించిన రెండు వారాల్లో మహమ్మారి వ్యాప్తి తగ్గినట్లయితే మరిన్ని సడలింపులు కల్పిస్తామని, క్రిస్‌మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలు కుటుంబాలతో కలిసి జరుపుకొనే పరిస్థితులు రావాలని మాక్రాన్‌ ఆకాంక్షించారు. ఇక వర్క్‌ఫ్రం హోంకు అనుమతించిన సంస్థలు వాటిని పొడిగిస్తే బాగుంటుందన్నారు. అదే విధంగా విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ క్లాసులను కొనసాగించాల్సి ఉంటుందని తెలిపారు.