కేసీఆర్ పరువు నడిబజారులో తీసేసిన ఈటల

Sat Jun 12 2021 22:00:01 GMT+0530 (IST)

Etela Rajender Comments On Kcr

అంతా అనుకున్నట్లే జరుగుతున్నప్పటికీ మాజీ మంత్రి సీనియర్ నేత ఈటల రాజేందర్ విషయంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఊహించని విధంగా ఇరుక్కుపోతున్నారని ప్రచారం జరుగుతోంది. అనూహ్య రీతిలో మంత్రి పదవి కోల్పోయిన ఈటల రాజేందర్ తదనంతరం టీఆర్ఎస్ వర్గాల నుంచి ఎదురుదాడి ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈనెల 14న బీజేపీలో చేరేందుకు ఆయన ముహుర్తం రెడీ చేసుకున్నారు. ఈ రెండింటి వల్లే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇరుకున పడిపోయారని అంటున్నారు.టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ కొద్దిరోజుల పాటు సొంత పార్టీ పెట్టాలా లేదా మరేదైనా పార్టీలో చేరాలా అన్న విషయంలో చర్చోపచర్చలు జరిపారు. అనంతరం ఆయన బీజేపీ గూటికి చేరాలని డిసైడయ్యారు. బీజేపీ పెద్దలతో సైతం ఈటల సమావేశం జరిపారు. ఆ పార్టీ పెద్దలు ఇచ్చిన భరోసా అనంతరం ఆయన కమలం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే నేడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే అది ఆమోదం పొందడం కూడా జరిగిపోయింది. అయితే ఈటల తీసుకున్న నిర్ణయం కేసీఆర్ ఎందుకు తీసుకోలేకపోతున్నారని ఆయన ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్న సమయంలో తనకు ఆ పార్టీ తరఫున వచ్చిన ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేశారు. అనంతరమే ఆయన బీజేపీ కండువా కప్పుకొంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరారు. వారు ఇప్పటివరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. తాము బీ ఫాం ఇచ్చి గెలిపించిన ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపచేశారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ నెత్తినోరూ బాదుకున్నా ఆయన స్పందించలేదు. తాజాగా ఈటల అంశంలో కాంగ్రెస్ ఘాటు విమర్శలు చేస్తోంది. ఒక ఎమ్మెల్యేగా ఈటల కు ఉన్న నైతికత ముఖ్యమంత్రిగా పూర్తి మెజార్టీ ఉన్న ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ కు లేదని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఉప ఎన్నికలు అంటే భయం వల్లే కేసీఆర్ సదరు జంపింగ్ నేతలతో రాజీనామాలు చేయించడం లేదని వారు దుయ్యబడుతున్నారు.