Begin typing your search above and press return to search.

మరో చర్చకు తెరలేపిన ఎలాన్ మాస్క్.. ఈసారి..!

By:  Tupaki Desk   |   4 Dec 2022 12:30 PM GMT
మరో చర్చకు తెరలేపిన ఎలాన్ మాస్క్.. ఈసారి..!
X
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ ను అపర కుబేరుడు.. టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ ఇటీవలే హస్తగతం చేసుకున్నారు. నాటి నుంచి రోజుకో కొత్త సంచలనాన్ని సృష్టిస్తూ నిత్యం వార్తలో నిలుస్తున్నారు. రెడ్ వైన్ యాప్ ను తిరిగి తీసుకొస్తానని ప్రకటించిన ఎలాన్ మాస్క్ అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. అయితే ట్విటర్లో బ్లూటిక్ విధానానికి పెయిడ్ సిస్టం తీసుకు రానుండటంపై మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నారు.

అయితే ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో భాగంగా ఎలాన్ మాస్క్ ఇటీవల ట్విటర్ ఉద్యోగులను వేలాదిగా ఇంటికి పంపించడంతోపాటు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడని అర్థమవుతోంది. అలాగే గతంలో ట్విట్టర్ కొన్ని అనివార్య కారణాలతో బ్యాన్ చేసిన పలువురు ప్రముఖులకు అవకాశం కల్పించే విషయంలో ఎలాన్ మాస్క్ సర్వే నిర్వహిస్తూ నెటిజన్లు అభిప్రాయాలు సేకరిస్తున్నారు.

అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ ట్విటర్ ఖాతాను పునరుద్ధరించడంపై ఇటీవల సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో మెజార్టీ నెటిజన్లు ట్రంప్ కు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ట్రంప్ ఖాతాను పునద్దరిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఉక్రెయిన్-రష్యా యుద్ధం శాంతి ప్రతిపాదనలపై సైతం ఎలాన్ మాస్క్ సర్వే నిర్వహించి నెటిజన్లు అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ సర్వేపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.

తాజాగా అమెరికా చీకటి రహస్యాలను వెలుగులోకి తీసుకొచ్చిన ఎడ్వర్డ్ స్నోడెన్.. వికీ లీక్స్ సహా వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేలకు అమెరికా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టాలా? లేదా అన్న అంశంపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో మొదలైన కొన్ని గంటల్లోనే లక్షలాది మంది నెటిజన్లు ఇందులో పాల్గొని తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.

తాను ముందుగా వాగ్దానం చేసినట్లుగా స్నోడెన్.. అసాంజెల క్షమాబిక్షపై సర్వే చేస్తున్నానని ఎలాన్ మాస్క్ తెలిపాడు. ఈ క్రమంలోనే గత 21 గంటల్లోనే 11లక్షల 39వేల 986 మంది ఈ పోలింగ్ పాల్గొన్నారు. వీరిలో 79 శాతం మంది అసాంజే.. స్నోడెన్ లకు క్షమాభిక్ష పెట్టాలని మద్దతు తెలిపారు. 21 శాతం మంది మాత్రం వ్యతిరేకించినట్లు సర్వేలో వెల్లడైంది.

కాగా అమెరికా సైన్యం.. ఇంటెలిజెన్స్ కు సంబంధించిన పలు కీలక విషయాలను స్నోడెన్.. అసాంజెలు బహిర్గతం చేశారనే కారణంతో వీరిని పట్టుకోవాలని అమెరికా వేట మొదలు పెట్టింది. అయితే అమెరికా నుంచి వారికి ప్రాణభయం ఉండటంతో వీరు ఆ దేశం విడిచి ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నారు.