జాతకాల ఆధారంగా తెలంగాణలో ఎన్నికలు.. రాజాసింగ్ కేసులో సుప్రీంకోర్టు ఎద్దేవా?

Tue Nov 29 2022 16:07:31 GMT+0530 (India Standard Time)

Elections based on horoscopes in Telangana: Supreme Court

కేసీఆర్ జాతకాల నమ్మకాలు  ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి. జాతకాలపై నమ్మకంతోనే కేసీఆర్ గత సారి ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విస్తృతంగా ప్రచారమైంది. ఇప్పుడు ఎమ్మెల్యే రాజాసింగ్ కేసు విషయంలో సుప్రీంకోర్టు అలానే వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.తెలంగాణలో ఎన్నికలపై సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర కామెంట్స్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జాతకాల ఆధారంగా నడుస్తున్నాయంటూ సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అనర్హుడిగా ప్రకటిస్తూ నోటీసులు జారీ చేయాలని టీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన సందర్భంగా ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఎమ్మెల్యే రాజాసింగ్ పై చాలా క్రిమినల్ కేసులు ఉన్నందున అతడిని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని ధర్మాసనానికి పిటీషనర్ విజ్ఞప్తి చేశాడు.

ఈ పిటీషన్ విచారణ సందర్భంగా 'తెలంగాణలో జాతక చక్రాల ఆధారంగా గ్రహాలన్నీ కలిసి ఈ కేసును వినాల్సిన అవసరం ఉందని.. ఎందుకంటే తెలంగాణలో ఎన్నికలు జాతకాల ఆధారంగా నడుస్తున్నాయంటూ ' సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయాన్ని న్యాయమూర్తి రామసుబ్రహ్మణ్యం గుర్తు చేశారు. ఈ పిటీషన్ లోని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.