Begin typing your search above and press return to search.

అసలు ఎన్నికల కమీషన్ ఏమి చేస్తోంది ?

By:  Tupaki Desk   |   26 Nov 2020 1:30 PM GMT
అసలు ఎన్నికల కమీషన్ ఏమి చేస్తోంది ?
X
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి)ఎన్నికల్లో పార్టీల ప్రచారం అన్నీ హద్దులు దాటిపోతున్న విషయం అందరు చూస్తున్నదే. జనాల్లో భావోద్వేగాలు రెచ్చ గొట్టడమే లక్ష్యంతో ఇటు బీజేపీ అటు అధికార టీఆర్ఎస్ తో పాటు ఎంఐఎం కూడా రెచ్చిపోతున్నాయి. గ్రేటర్ ఎన్నికలతో ఏమాత్రం సంబంధం లేని సర్జికల్ స్ట్రైక్స్ అని - విగ్రహాల ధ్వంసం చేయటం - సమాదులు కూల్చేయటం, -దారుసలాంను నేలమట్టం చేయటం అనే అంశాల సవాళ్ళు - ప్రతి సవాళ్ళు చేసుకుంటున్నారు కీలక నేతలు. దాంతో పార్టీల ప్రచారంతో ఆయా ప్రాంతాల్లో బాగా విద్వేషాలు పెరిగిపోతున్నాయి.

రాజకీయ పార్టీలన్నాక ప్రచారం ఇలాగే చేస్తాయి. పైగా ఎన్నికల్లో గెలుపు అవకాశాలు నువ్వా-నేనా అనేట్లుంటే పరిస్ధితి దారుణంగానే ఉంటుంది. రాజకీయపార్టీలు ఇలాగే ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఎన్నికల కమీషన్ ఏమి చేస్తోంది ? అన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు. పార్టీల ప్రచారాన్ని అదుపు చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమీషన్ దే. ఎన్నికల ప్రచారంలో ఏమాత్రం సంబంధం లేని అంశాలను పార్టీలు ప్రస్తావిస్తున్నపుడు వాటిని కంట్రోల్ చేయాల్సిన కమీషన్ కూడా చోద్యం చూస్తున్నట్లే ఉంది.

ప్రచారంలో కట్టుదాటుతున్నారని అనుకునే పార్టీలకు లేదా అభ్యర్ధులకు వెంటనే నోటీసులు ఇచ్చి వాళ్ళని కంట్రోల్ లో పెట్టడానికి కనీసం కమీషన్ ప్రయత్నం కూడా చేస్తున్నట్లు లేదు. అందుకనే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారందరు. పార్టీలు బాగానే ఉంటాయి, ప్రచారం చేస్తున్న వారు, అభ్యర్ధులు కూడా బాగానే ఉంటారు. మధ్యలో ప్రచారం కారణంగా భావోద్వేగాలకు లోనయి రెచ్చిపోయే మద్దతుదారులో లేకపోతే మామూలు జనాలే నష్టపోతారని అందరికీ తెలిసిందే. కనీసం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునైనా కమీషన్ కట్టుదాటుతున్న పార్టీలను కంట్రోల్ చేయాలని అనుకోకపోవటం విచిత్రంగానే ఉంది.