Begin typing your search above and press return to search.

ప్రకాశం జిల్లాలో ఓవైపు ఈడీ.. మరోవైపు సీఐడీ.. అందుకేనా?

By:  Tupaki Desk   |   5 Dec 2022 11:30 AM GMT
ప్రకాశం జిల్లాలో ఓవైపు ఈడీ.. మరోవైపు సీఐడీ.. అందుకేనా?
X
ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లా హీటెక్కింది. ఓవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), మరోవైపు ఏపీ సీఐడీ విచారణలతో ప్రకాశం జిల్లా ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారింది.

ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఇప్పటికే ఈడీ పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అమిత్‌ అరోడా అనే నిందితుడి అరెస్టు చేసి కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పలువురి పేర్లను ఈడీ వెల్లడించింది. వీరిలో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు కూడా ఉంది. ఈ వ్యవహారంలో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఎంపీ మాగుంట పలుమార్లు స్పష్టం చేశారు. ఇదంతా ఉత్తర భారతదేశ వ్యాపారుల కుట్ర అని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈడీ మాత్రం విచారణ సాగిస్తోంది.

అలాగే ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు, దాని పరిసర ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న భూదందాలకు సంబంధించి ఏపీ సీఐడీ సైతం విచారణ సాగిస్తోంది. ఈ మేరకు తమకు అందిన ఫిర్యాదుల మేరకు
రెవెన్యూ అధికారులకు సీఐడీ తాఖీదులు పంపింది. ఇప్పుడు ఈ అంశం ప్రకాశం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఒంగోలులో కొన్ని రూ.వందల కోట్ల విలువైన భూములను అత్యంత వివాదాస్పద రీతిలో రెవెన్యూ అధికారులు కొందరికి కట్టబెట్టారని సమాచారం. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించి ఈనాం భూములకు కూడా పట్టాలు సృష్టించారని తెలుస్తోంది. రాజకీయ నాయకుల ప్రాపకం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడిన రెవెన్యూ అధికారులు ఇప్పుడు సీఐడీ విచారణలో చిక్కుల్లో పడ్డారు.

ఓవైపు మద్యం కుంభకోణం వ్యవహారంలో ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డిపై ఈడీ విచారణ సాగిస్తోంది. మరోవైపు కోట్లాది రూపాయల భూముల కుంభకోణం వ్యవహారంలో ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయన కుమారుడు ప్రణీత్‌రెడ్డి నియోజకవర్గంలో చురుగ్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలు నగరంలో జరిగిన భూఅక్రమాలు, అందుకు రెవెన్యూ అధికారులు సహకరించడం సహజంగానే ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి.

భూ అక్రమాలకు సంబంధించి డిసెంబర్‌ 9లోపు వివరాలతో విచారణకు హాజరుకావాలని రెవెన్యూ అధికారులకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. రెవెన్యూ వీరిపై వచ్చిన అభియోగాలు రుజువైతే మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.