హైదారబాద్ లో ‘తిన్నంత బిర్యానీ’.. రూ.60లకే!

Mon Mar 01 2021 07:00:01 GMT+0530 (IST)

'Eat Biryani' in Hyderabad .. for only Rs.60!

కరోనా తర్వాత టిఫిన్ రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఒక ప్లేట్ వడ రూ.50 నుంచి రూ.60 వరకు చేరిపోయింది. అంతలా ధరలు పెరిగిపోయిన వేళ.. వేడి వేడి బిర్యానీ తిన్నంత పెడతామని.. అందుకు కేవలం రూ.60 ఇస్తే చాలన్న మాట ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. విన్నంతనే ఎక్కడో తెలుసుకోవాలనుకోవటం ఖాయం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టు ఇప్పుడు అందరిని విపరీతంగా ఆకర్సిస్తోంది.ఇవాల్టి రోజున రూ.60లకు బిర్యానీ హైదరాబాద్ లోని చాలా చోట్ల దొరుకుతుంది. కానీ.. తిన్నంత బిర్యానీ పెడతాం.. కేవలం రూ.60 చెల్లిస్తే చాలన్న మాట చాలా అరుదుగా చెప్పాలి. ఇంతకీ ఈ అదిరే ఆఫర్ ఎక్కడంటారా? అక్కడికే వస్తున్నాం. ఉప్పల్ చౌరస్తా నుంచి రామంతాపూర్ కు వెళ్లే మార్గంలో తిన్నంత బిర్యానీ రోడ్డు పక్కనే లభిస్తోంది. ఇంత తక్కువ ధరకు ఇస్తున్నారు.. నాణ్యత విషయం గురించి సందేహాలు రావటం ఖాయం.

కానీ.. తిన్న వారు మాత్రం హ్యాపీగా వెళ్లిపోతున్నట్లుగా చెబుతున్నారు. ఇద్దరు అన్నదమ్ములు (కిరణ్.. ఉదయ్) కలిసి స్టార్టప్ గా తిన్నంత బిర్యానీ పాయింట్ ను సరికొత్తగా తీసుకొచ్చారు. ఇంత తక్కువ ధరకే బిర్యానీ ఇస్తున్నారు కాబట్టి.. ఇంకేం ఇవ్వరనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఈ అరవై రూపాయిలకే తిన్నంత బిర్యానీ.. దానికి సరిపడే గ్రేవీ.. సలాడ్.. పెరుగు.. స్వీట్.. మినరల్ వాటర్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఇది పూర్తి వెజ్ బిర్యానీ అని చెబుతున్నారు. తక్కువ ధరకు కాబట్టి నాసిరకపు బాస్మతి బియ్యాన్నివాడటం లేదని.. నాణ్యత విషయంలోరాజీ పడటం లేదంటున్నారు. కావాలంటే ఒక్కసారి వచ్చి చూస్తే తెలుస్తుందంటున్నారు. మరి.. ఒక చూపు చూస్తారా?