ప్రకృతి విపత్తులను ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదు. అయితే ముందస్తుగా సమాచారం తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటే జరుగబోయే నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చు. తాజాగా తుర్కియే.. పాలస్తీనా ప్రాంతాలను వరుస భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. రెండు రోజుల వ్యవధిలో టర్కీ.. సిరియాల్లో 100 సార్లు భూకంపించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
దీంతో అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయాందోళనతో కాలం వెళ్లదీస్తున్నారు. తుర్కియేలో గత 84 ఏళ్లలో జరిగిన అతిపెద్ద భూకంపం ఇదేనంటూ ఆ దేశ అధ్యక్షుడు సైతం ప్రకటించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈక్రమంలోనే టర్కీ.. సిరియా దేశాలకు భారత్ సహా ప్రపంచ దేశాలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే భారతదేశంలో భూకంపాలు వచ్చే ప్రాంతాలపై ఐఐఐటీ హైదరాబాద్.. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ).. కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ భూకంప విపత్తు ముప్పు సూచిక (ఎర్త్క్వేక్ డిజాస్టర్ రిస్క్ ఇండెక్స్) నివేదిక బయటకు వచ్చింది. ఈ జాబితాలో విజయవాడ.. ఢిల్లీ.. కోలకత్తా.. చైన్నై.. ముంబాయి సహా 50 నగరాలకు అధిక భూకంప ముప్పు ఉన్నట్లు పేర్కొంది.
ఈ జాబితాను జనసాంద్రత.. గృహ నిర్మాణం.. నగరాల పరిస్థితి ఆధారంగా చేసుకొని తాము ప్రయోగాత్మకంగా అధ్యయనం చేపట్టినట్లు తెలుస్తోంది. ఐఐఐటీ హైదరాబాద్లోని ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ విభాగ అధిపతి ప్రొఫెసర్ ప్రదీప్ రామనచర్ల సారథ్యంలోని పరిశోధక విద్యార్థులు మూడేళ్లపాటు శ్రమించి ఈ జాబితాను రూపొందించారు. ఈ నివేదికను ఐఐఐటీ ప్రొఫెసర్లు.. ప్రభుత్వ యంత్రాంగం సమీక్షించినట్లు ఆయన వివరించారు.
దేశవ్యాప్తంగా ఏపీలోని విజయవాడ సహా 50 నగరాలు.. ఒక జిల్లా అధిక భూకంప ముప్పు గల మండలాల్లో ఉన్నట్లు వారి అధ్యయనంలో వెల్లడైంది. ఈ 50 నగరాల జాబితాలోనూ 13 నగరాలు అధిక ప్రమాదకర స్థాయిని.. 30 మధ్యస్థ.. ఏడు నగరాలు తక్కువ ప్రమాదకర స్థాయిల్లో ఉన్నట్లు వివరించారు.
అధిక భూకంప మండలంలో ఏపీలోని విజయవాడ సహా దేశ రాజధాని ఢిల్లీ.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా.. తమిళనాడు రాజధాని చెన్నై సహా పుణె.. ముంబై.. అహ్మదాబాద్.. సిలిగురి.. డార్జిలింగ్.. చండీగఢ్ సహా తదితర నగరాలు ఉన్నట్లు ఎర్త్క్వేక్ డిజాస్టర్ రిస్క్ ఇండెక్స్ పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటే వీలైనంత వరకు ఆస్తి.. ప్రాణనష్టం నివారించే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.