Begin typing your search above and press return to search.

ఈవీఎం కోడ్ మార్చారు.. బాంబుపేల్చిన హరికృష్ణ

By:  Tupaki Desk   |   15 April 2019 7:04 AM
ఈవీఎం కోడ్ మార్చారు.. బాంబుపేల్చిన హరికృష్ణ
X
ఈవీఎం కోడ్ మార్చారని.. సాంకేతిక లోపాలు తాను గమనించానని ఏపీ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హరికృష్ణ ప్రసాద్ సంచలన నిజాలు బయటపెట్టారు. ఇదివరకు ఈయన 2010లోనే ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని నిరూపించారు. అది దుమారం రేగడంతో ఈసీ వీవీ ప్యాట్ లను తీసుకొచ్చి ఓటు ఎవరికి వేశామన్నది గుర్తించేలా మార్పులు చేసింది.

అయితే తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు ఈవీఎంల అక్రమాలపై పోరుబాట పట్టడంతో హరికృష్ణ ప్రసాద్ ఈవీఎంలలోని తాజా లొసుగులను బయటపెట్టారు. ఈనెల 10న పీలేరులోని ఒక పోలింగ్ బూత్ లో ఓటింగ్ ప్రక్రియను ప్రదర్శించారని.. అందులో ఓటు వెయ్యగానే ఏడు సెకన్ల పాటు వీవీప్యాట్ కనిపించాలని.. కానీ 3 సెకండ్లే కనిపిస్తోందని తాను గుర్తించానని వివరించారు. దీనిపై కలెక్టర్, ఈసీకి ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని వివరించారు. దీన్ని బట్టి ఈవీఎం కోడ్ మార్చారని అర్థమవుతోందన్నారు. అయితే 7 సెకండ్ల పాటు కనిపించాలని కోడ్ రాస్తే 3 సెకండ్ల పాటే ఎలా కనిపిస్తుందని ఆయన ఈసీని ప్రశ్నించారు. కొన్ని చోట్ల రెండు సెంకడ్లే కనిపిస్తోందని వీడియోలు పంపారని వివరించారు.

ఇక గత ఏడాది నవంబర్ లోనూ ఈసీ ఉన్న ఫళంగా ఈవీఎంలను వెనక్కి రప్పించి మార్పులు చేసిందని.. అల్యూమినీయం కవర్లకు బదులు.. స్టీల్ కవర్లను వెయ్యాలని చెప్పిందని.. దీని వెనుక ఏదో జరిగిందని హరికృష్ణ ప్రసాద్ అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈ అనుమానాల నేపథ్యంలో ప్రజల్లో ఈవీఎంల సమర్థతపై మరోమారు చర్చ మొదలైంది. దీనిపై ఈసీ క్లారిటీ ఇవ్వకపోతే మొత్తం పోలింగ్ ప్రక్రియపైనే అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉంది. చంద్రబాబు ఆరోపణలకు బలం చేకూరే అవకాశాలు లేకపోలేదు.