Begin typing your search above and press return to search.

ఢిల్లీ మద్యం కుంభకోణం.. అటు నుంచి నరుక్కొస్తున్న ఈడీ!

By:  Tupaki Desk   |   17 March 2023 2:02 PM GMT
ఢిల్లీ మద్యం కుంభకోణం.. అటు నుంచి నరుక్కొస్తున్న ఈడీ!
X
ఢిల్లీ మద్యం కుంభకోణంలో వ్యవహారంలో ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టర్‌ (ఈడీ) దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్య నేత మనీష్‌ సిసోడియాతోపాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్‌ చంద్రారెడ్డి, బోయినపల్లి అభిషేక్, రామచంద్ర పిళ్లై, ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి తదితరులను ఈడీ అరెస్టు చేసింది.సౌత్‌ గ్రూప్‌ పేరుతో వీరంతా ఢిల్లీ మద్యంలో చక్రం తిప్పారని.. ఢిల్లీ మద్యం విధానం తమకు అనుకూలంగా ఉండేలా వందల కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించారనే అభియోగాలు ఉన్నాయి. దీనివల్ల ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లందని ఆరోపణలు వచ్చాయి.

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ముఖ్య పాత్రధారేనని ఈడీ విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో కవితను ఇప్పటికే ఈడీ విచారించింది. రెండోసారి నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని కోరగా కవిత తన ఆరోగ్యం బాగోలేదని.. రాలేనని తిరస్కరించారు. అలాగే తన ఇంటి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు సిద్ధమని ప్రకటించారు.

అంతేకాకుండా కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ విచారణలో నిబంధనలు పాటించడం లేదని లె లిపారు. మహిళను రాత్రి సమయం వరకు విచారించకూడదనే నిబంధనలు ఉన్నా తనను మొదటిసారి విచారణ సందర్భంగా రాత్రి 8 వరకు విచారించారని కోర్టు దృష్టికి తెచ్చారు. నిందితులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారని.. తనపై ప్రయోగించే ప్రమాదం ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసును అత్యవసరంగా విచారించాలని కోరారు.

అయితే అత్యవసర విచారణకు కోర్టు అంగీకరించలేదు. మార్చి 24న విచారిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో మార్చి 20న విచారణకు రావాలని ఈడీ కవితకు నోటీసులు జారీ చేసింది.ఈ నేపథ్యంలో ఈడీ రూటు మార్చింది. ఒంగోలు వైసీపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆయనను మార్చి 18న విచారణకు రావాలని ఆదేశించింది. కవిత తమ విచారణకు సహకరించకపోవడంతో ముందు మాగుంట శ్రీనివాసులరెడ్డి వైపు నుంచి మద్యం కుంభకోణం కేసును నరుక్కురావాలని ఈడీ భావిస్తోంది.

కాగా మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవ ప్రస్తుతం బాలాజీ గ్రూపు యజమానిగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే సుమారు 10 మందికి పైగా అరెస్టు అయ్యారు. ఇదే కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని గతేడాది అక్టోబర్‌లోనే సీబీఐ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయనతోపాటూ.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను కూడా సీబీఐ ప్రశ్నించింది. ఫిబ్రవరిలో ఈడీ రంగంలోకి దిగి రాఘవను అందుపులోకి తీసుకుంది. మధ్యవర్తుల ద్వారా ఢిల్లీలోని కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి లంచాలు ఇచ్చారని మాగుంట రాఘవపై ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11న రాఘవరెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు.. ఆయన సరిగా సహకరించట్లేదనే ఉద్దేశంతో అరెస్టు చేశారు.కాగా సౌత్‌ గ్రూప్‌ కు సంబంధించి అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌ చంద్రారెడ్డి, ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబు, రాఘవరెడ్డి ఇప్పటివరకూ అరెస్ట్‌ అయ్యారు. కాగా మాగుంట రాఘవ విషయానికొస్తే.. బాలాజీ డిస్టిలరీస్‌ కాకుండా, ఏంజెల్‌ షాంపైన్‌ ఎల్‌ఎల్పీ, తమిళనాడు డిస్టిలరీ ఇండస్ట్రియల్‌ ఆల్కహాల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వంటి ఇతర కంపెనీలు మాగుంట కుటుంబానికి సంబంధించిన రెండు కీలక సంస్థలపై సీబీఐ దృష్టి సారించిందని చెబుతున్నారు. మద్యం తయారీ, పంపిణీలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.

ఈ వ్యవహారంలో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు. ఇదంతా ఉత్తర భారతదేశ వ్యాపారుల కుట్ర అని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈడీ మాత్రం విచారణ సాగిస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి 18న శనివారం వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈడీ విచారణకు హాజరు కానున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.