Begin typing your search above and press return to search.

ఈడీపై రివర్సు గేర్.. కవితక్క వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా?

By:  Tupaki Desk   |   21 March 2023 5:38 PM GMT
ఈడీపై రివర్సు గేర్.. కవితక్క వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా?
X
రోటీన్ గా జరిగితే వింతేముంది? స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి.. స్క్రిప్టు రాసిన వేళలో అనూహ్య సన్నివేశాలు చోటు చేసుకోకపోతేనే ఆశ్చర్యం. ఈ వాదనకు తగ్గట్లే.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థల్లో ఒకటైన ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) జరుపుతున్న విచారణలో అనుకోని సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కావొచ్చు.. పెద్ద పెద్ద నేతలు మొదలు ప్రముఖులు ఎవరైనా సరే.. ఈడీ విచారణ అన్నంతనే హడావుడిగా వెళ్లటం.. బుద్ధిగా వారు అడిగింది చెప్పి.. బయటకు రావటం ఇంతకాలం చూశాం.

అందుకు భిన్నమైన పరిణామాలు ఎమ్మెల్సీ కవిత విచారణ సందర్భంగా చోటు చేసుకోవటం విశేషం. ఈడీ ఇచ్చిన నోటీసులకు తాను హాజరు కాలేదని చెబుతూ.. తన తరఫున తన వ్యక్తిగత సహాయకుడ్ని అడగాల్సిందిగా కోరటం ఒక సంచలనం అయితే.. తాజాగా ఈడీ విచారణకు వెళ్లే మూడో రోజున.. తాను తన ఫోన్లను ధ్వంసం చేసినట్లుగా ఈడీ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ.. ప్లాస్టిక్ కవర్లో ఫోన్లను చూపించిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల కాలంలో ఈడీ ఎంతో మందికి నోటీసులు ఇవ్వటం.. వారిని విచారించటం.. ఆ సందర్భంగా కొందరిని అరెస్టు చేయగా.. మరికొందరి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం చూశాం. ఈ సందర్భంగా ఏ ప్రముఖుడు సైతం.. కవిత మాదిరిగా వ్యవహరించింది లేదన్న మాట వినిపిస్తోంది. ఎందుకిలా జరుగుతోంది? దీనికి కారణం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నలుగా మారాయి.

కవిత అరెస్టు ఖాయమని.. ఈ రోజు జరుగుతుందని.. ఆమె విచారణకు హాజరైన ప్రతి రోజు ప్రచారం జరగటం.. గంటల తరబడి విచారణ తర్వాత ఆమె నవ్వుతూ బయటకు రావటం.. కారెక్కి ఇంటికి వెళ్లటం లాంటివి చూస్తున్నదే. ఈ రోజు (మంగళవారం) నాలుగో దఫా ఆమె ఈడీ ఎదుట విచారైన సంగతి తెలిసిందే. మిగిలిన రోజుల సంగతి ఎలా ఉన్నా.. ఈ రోజు మాత్రం ఆమె అరెస్టు ఖాయమన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. కవిత తన పాత ఫోన్లను అందరి ఎదుట ప్రదర్శించటం ద్వారా కొత్త చర్చకు తెర తీశారని చెప్పాలి.

తాజా పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొందరి విశ్లేషణల ప్రకారం చూస్తే.. కవిత మీద ఈడీ ఒత్తిడి పెంచటం కాదు.. రివర్సులో ఆమె కారణంగా ఈడీ ఒత్తిడికి లోనయ్యేలా చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. మిగిలిన వారి మాదిరి దూకుడుగా తన విషయంలో వ్యవహరించటం అంత ఈజీ కాదన్న విషయాన్ని తన చేష్టలతో కవిత స్పష్టం చేస్తున్నారా? అన్నది ప్రశ్నగా మారింది. మరోవైపు.. ఈడీ కానీ ఆమెను అరెస్టు చేస్తే.. ఇదంతా రాజకీయ కక్షతోనే ఇదంతా జరుగుతుందన్న భావన కలిగేలా చేయటం కోసమే తన పాత ఫోన్లను అందరి ఎదుట ప్రదర్శించారన్నవాదన వినిపిస్తోంది. ఏమైనా.. విచారణ వేళ.. ఈడీ అడిగే ప్రశ్నలకు కవిత ఒత్తిడికి గురి కావటం సంగతి ఎలా ఉన్నా.. బయట మాత్రం ఆమె చేసే చేష్టలన్నీ వ్యూహాత్మకంగా ఉన్నాయన్న మాట బలంగా వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.