Begin typing your search above and press return to search.

మంగళవారం ఈడీ విచారణలో '10' చుట్టూనే కవితకు ప్రశ్నలు

By:  Tupaki Desk   |   22 March 2023 4:00 PM GMT
మంగళవారం ఈడీ విచారణలో 10 చుట్టూనే కవితకు ప్రశ్నలు
X
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవితను మరోసారి విచారించింది ఈడీ. మంగళవారం ఆమె విచారణ మొత్తం 10 చుట్టూనే తిరగటం గమనార్హం. ఆమెను ఉదయం నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు.. ఆమెకు సంబంధించిన పది ఫోన్ల మీదనే ప్రశ్నలు గుప్పించినట్లుగా తెలుస్తోంది.

దాదాపు పదిన్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన అధికారులు.. తమ ప్రశ్నల్లో అధిక భాగంగా ఫోన్ల చుట్టూనే తిప్పటం.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత సైతం తన ఫోన్ ను స్వాధీనం చేసుకోవటం ఏమిటి? అన్న అంశం పైనా.. తాను ఫోన్లను ధ్వంసం చేయలేదన్న విషయాన్ని స్పష్టంగా.. బలంగా ప్రస్తావించినట్లుగా సమాచారం.

''ఒకే రోజు రెండు ఫోన్లు ఎందుకు వాడారు? అన్నిసార్లు ఫోన్లు ఎందుకు మార్చారు? రెండు నెంబర్లతో పది ఫోన్లు ఎందుకు మార్చారు?'' లాంటి పలు ప్రశ్నలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికి మూడు సార్లు విచారణను ఎదుర్కొంటున్న ఆమె.. అరెస్టు ప్రమాదం ఉందన్న ప్రచారం జరిగినప్పటికీ అలాంటిదేమీ చోటు చేసుకోలేదు. అదే సమయంలో.. మళ్లీ విచారణ ఎప్పుడున్న విషయాన్ని కూడా అధికారులు వెల్లడించలేదు.

ఢిల్లీ మద్యం స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ రెడ్డి.. అభిషేక్ బోయినపల్లి.. బుచ్చిబాబు తదితరులు సైతం ఫోన్లు మార్చటాన్ని ఈడీ ప్రస్తావించి.. ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మారచిన అన్ని ఫోన్లలో ఉన్న సమాచారాన్ని క్రోడికరించి.. సమాచారాన్ని సేకరించినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాను ఫోన్లను ధ్వంసం చేయలేదని.. తన ఫోన్లను వంటమనిషి.. పార్టీ కార్యకర్తలు.. తోటి కోడలు కూడా తన ఫోన్లను వాడుతుంటారని ఆమె పేర్కొన్నట్లుగా తెలిసింది.

తాను ఏ ఫోన్ ను ధ్వంసం చేయలేదని చెప్పినట్లుగా చెబుతున్నారు. ఆమెకు ఉన్న రెండు నెంబర్లలో 620తో మొదలయ్యే నెంబరుతో ఆరు ఫోన్లను.. 898తో మొదలయ్యే నెంబరుతో నాలుగు ఫోన్లను మార్చినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ ఉదంతంలో కవితతో సహా మొత్తం 36 మంది 70 ఫోన్లను మార్చినట్లుగా అధికారుల వాదనగా తెలుస్తోంది. గతంలో వాడిన పది ఫోన్లు..తాజాగా వాడుతున్న ఫోన్ తో కలుపుకుంటే మొత్తం 11 ఫోన్లుగా లెక్క తేల్చారు. ఈ మధ్యన విచారణ సందర్భంగా ఆమె డ్రైవర్ ను పంపించి మరీ.. తెప్పించిన ఫోన్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉండగా తన ఫోన్ ను స్వాధీనం చేసుకున్న అంశంపై కవిత పలుమార్లు ప్రస్తావించినట్లుగాచెబుతున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటల విచారణకు హాజరైన కవిత రాత్రి 9.30 గంటల వరకువిచారణసాగినట్లుగా చెబుతున్నారు. దాదాపు పది గంటల పాడు విచారణ జరిగింది. సుమారు 9.40 గంటల వేళలో ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఆమె.. పిడికిలి బిగించి.. చిరునవ్వులు చిందించి కారుక్కి వెళ్లిపోయారు. ఇప్పటివరకు జరిగిన మూడు విచారణల్లో తొలిసారి ఎనిమిది గంటలు.. రెండోసారి 10.30 గంటలు.. మూడోసారి 10 గంటల పాటు విచారణ సాగటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.