కర్ణాటకం.. మళ్లీ మొదలైంది..

Mon Nov 18 2019 17:47:45 GMT+0530 (IST)

Drama In Karnataka Started Again

కర్ణాటకలో మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది.  కన్నడ నాట ఇంతకుముందు కొలువైన జేడీఎస్-కాంగ్రెస్ సర్కారు కూలడంలో 17మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు కీలకంగా మారింది. 17మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేశారు. దానివల్లే మేజిక్ మెజార్టీ మార్క్ తగ్గి కుమారస్వామి సర్కారు పడిపోయింది. బీజేపీ కర్ణాటకలో కొలువుదీరింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ 17 స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. డిసెంబర్ 5న కర్ణాటకలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి.కర్ణాటకలో ఉప ఎన్నికల్లో పాల్గొనడానికి నిషేధం ఎదుర్కొన్న 17మంది ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు మళ్లీ పోటీచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సోమవారం ఉప ఎన్నికలు జరుగుతున్న 15 అసెంబ్లీ స్థానాల్లో పాత వారు 15మంది ఎమ్మెల్యేలు మళ్లీ నామినేషన్లను దాఖలు చేశారు.

ఇప్పటికే బీజేపీ తన 15 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక కాంగ్రెస్ మూడు విడతల్లో అభ్యర్థులను ప్రకటించింది. జేడీఎస్ కేవలం 11 స్థానాల్లోనే అభ్యర్థులను నిలుపుతోంది.

ఈ సోమవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. దీంతో కర్ణాటకలో ఉప ఎన్నికలు జరుగుతున్న 15 అసెంబ్లీ స్థానాల్లో నామినేషన్లు పోటెత్తాయి. ఈ రాత్రికి పూర్తి లెక్క తేలనుంది. గడిచిన ఆరు రోజుల్లోనే 116 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఇక బీజేపీ ఇప్పటికే 15 నియోజకవర్గాలకు 15మంది మంత్రులను ఇన్ చార్జిలుగా నియమించింది. కాంగ్రెస్ తమ సీనియర్లకు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది. దాదాపు 15 చిన్నా చితక పార్టీలు బరిలో నిలుస్తున్న ఉప ఎన్నికల్లో ఎవరిని విజయం వరిస్తుందనేది చెప్పడం కష్టంగా మారింది.