Begin typing your search above and press return to search.

రూ.75 కోట్ల హవాలా బాంబ్ మీద బోలెడన్ని సందేహాలు.. మరేం జరుగుతుంది?

By:  Tupaki Desk   |   1 April 2023 9:33 AM GMT
రూ.75 కోట్ల హవాలా బాంబ్ మీద బోలెడన్ని సందేహాలు.. మరేం జరుగుతుంది?
X
మాటలతో భారీ డీల్స్ చేసే టాలెంట్ కొందరికి ఉంటుంది. వందల కోట్ల హవాలా కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ కూడా ఆ కోవలోకే వస్తాడని చెప్పాడు. చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పుడు కొత్త కోణంగా సుఖేశ్ ఎపిసోడ్ వస్తుందని చెప్పాలి. అతను చెప్పినట్లుగా.. నిజంగానే అలా జరిగి ఉంటుందా? అందుకు అవకాశాలు ఎన్ని? అన్నది ప్రశ్న.

తాను ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పిన నేపథ్యంలో రూ.75 కోట్ల మొత్తాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో అందజేసినట్లుగా చెప్పటం తెలిసిందే. అది కూడా హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో చెప్పటం గమనార్హం. అతడు చెప్పిందే నిజమని అనుకుందాం. అసలు ఢిల్లీ లిక్కర్ స్కాం ఏమిటి? కేజ్రీవాల్ సర్కారు తీసుకొచ్చే మద్యం పాలసీని మార్చటం. అందులో ఎమ్మెల్సీ కవితతో పాటు బోలెడంత మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇప్పుడు ఆ కేసు వివరాల్లోకి వెళ్లే కన్నా.. ఆ కేసును సింఫుల్ గా ఒక్క లైనులో చెప్పాలంటే.. "కొత్తగా తీసుకొచ్చిన మద్యం పాలసీతో వైసీపీ ఎంపీతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పలువురు ముఖ్యులకు సంబంధించిన కంపెనీలకు భారీ లబ్థి చేకూరిందని..దానికి బదులుగా భారీ మొత్తాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఇచ్చారు అని" అలాంటి వేళలో భారీ మొత్తాన్ని కవిత (విషయం ఇట్టే అర్థం కావటం కోసమే ఇలా రాయాల్సి వస్తోంది. ఆమె మీద ఉన్న ఆరోపణలు నేటికి నిరూపితం కాలేదన్నది మర్చిపోకూడదు) అండ్ కో భారీ మొత్తాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వంలోనివ్యక్తులకు అందించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

అయితే.. సుఖేశ్ ఆరోపణలు భిన్నంగా ఉన్నాయి. తానే కేజ్రీవాల్ తరఫున బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో రూ.75 కోట్లు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. కేజ్రీవాల్ సర్కారు కారణంగా లబ్థి పొందింది బీఆర్ఎస్ కు చెందిన కవిత (?) అండ్ కోఅయినప్పుడు.. అందుకు ప్రతిఫలంగా కేజ్రీవాల్(?) అండ్ కోకు ముడుపులు అందాలే కానీ.. రివర్సులో సీఎం కేజ్రీవాలే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులోని వ్యక్తికి డబ్బులు ఎందుకు పంపుతారు? అన్నది ప్రశ్న. ఒకవేళ అంత భారీ మొత్తాన్ని పంపారనే అనుకుందాం.

ఇంత భారీ మొత్తాన్ని సినిమాల్లో చూపించినట్లుగా తీసుకొని పార్టీ ఆఫీసుకే పంపుతారా? రూ.75 కోట్ల భారీ మొత్తాన్ని ఒక పార్టీ ఆఫీసులోని వ్యక్తికి ఇవ్వాలన్నదే నిజం అనుకుందాం. అలాంటి పనులను ఆదేశించటం కోసం ఏ అమాయక ముఖ్యమంత్రి అయినా తానే స్వయంగా ఆదేశాలు ఇస్తాడా? అలాంటివి చేసేందుకు బోలెడంత మంది ఉంటారన్నది మర్చిపోకూడదు. వారిని వదిలేసి.. ముఖ్యమంత్రే నేరుగా ఆదేశాలు ఇచ్చేంత పిచ్చి పని చేస్తారా? అన్నది మరోప్రశ్న.

సరే.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరీ అమాయకుడే.. ఇలాంటివి చేశాడే అనుకుందాం. ఇంత భారీ మొత్తాన్ని బీఆర్ఎస్ ఆఫీసులో తీసుకోవటానికి మెడ మీద తలకాయి ఉన్నోడు ఎవరైన ఒప్పుకుంటాడా? అందుకు బదులుగా ఎన్ని ప్లేస్ లు లేవు. వాటిని వదిలేసి.. నిత్యం హడావుడిగా ఉండే అధికార పార్టీ ఆఫీసుకు తీసుకురమ్మని ఎవరైనా చెబుతారా? లాంటి సందేహాలు రాక మానవు.

మరి.. సుఖేశ్ చంద్రశేఖర్ చేస్తున్న ఆరోపణల్ని చూసినప్పుడు నేతి బీరలో నేయ్యి మాదిరే అన్నట్లుగా కనిపిస్తాయి. మరి..ఈ సంచలన ఆరోపణల నేపథ్యంలో ఏయే విచారణ సంస్థలు రంగంలోకి దిగుతాయో చూడాలి. ఏమేం పరిణామాలుచోటు చేసుకుంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.