Begin typing your search above and press return to search.

టీ ఆర్టీసీ ఉద్యోగుల నిధులన్ని అలా అయిపోతున్నాయా?

By:  Tupaki Desk   |   28 Aug 2020 3:00 PM IST
టీ ఆర్టీసీ ఉద్యోగుల నిధులన్ని అలా అయిపోతున్నాయా?
X
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త సమస్య వచ్చి పడింది. వేలాదిగా ఉన్న ఉద్యోగులకు చెంది వందలాది కోట్ల రూపాయాల్ని చెల్లించని వైనం వెలుగు చూసింది. తమ భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న మొత్తాన్ని ఆర్టీసీ యాజమాన్యాలు క్రమం తప్పకుండా చెల్లించాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా బకాయిలు పెట్టేస్తున్న వైనం ఆర్టీసీ ఉద్యోగులకు వేదనను కలిగిస్తోంది. ఇప్పుడు అనుసరిస్తున్న విధానంలో ఉద్యోగులు నష్టపోవటం గమనార్హం.

ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన ఆర్టీసీ ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న పొదుపు.. పరపతి సంఘం (సీసీఎస్) ఇప్పుడు దయనీయ స్థితిలోకి చేరింది. 1952లో 1.2లక్షల మంది ఆర్టీసీ కార్మికులు ఉంటే.. విభజన నేపథ్యంలో రెండుగా చీలిపోయింది. 2020 నాటికి రిటైర్ అయిన ఉద్యోగుల్ని మినహాయిస్తే.. ప్రస్తుతం 48 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రతి నెల తమ జీతంలో కొంత మొత్తాన్ని మినహాయించుకొని సీసీఎస్ లో దాచుకోవటం ఎప్పటి నుంచో ఉన్నదే. ఉద్యోగులకు ఏదైనా అవసరాలు.. ఆర్థిక కష్టాలు వచ్చినప్పుడు ఈ నిధి నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు సమస్య ఏమంటే.. రెండేళ్లుగా ఆర్టీసీ ఉద్యోగులు సీసీఎస్ కు చెల్లించిన రూ.632 కోట్లు ఇప్పటివరకు ఆ ఖాతాకు చేరలేదు. దీనిపై వడ్డీనే రూ.102 కోట్లుగా ఉంది. తమజీతాల్లో నుంచి చెల్లించిన మొత్తం సీసీఎస్ కు చేరకపోవటం ఏమిటన్న ప్రశ్న ఒకటైతే. తమ అవసరా కోసం ఉద్యోగులు సీసీఎస్ చుట్టూ తిరుగుతున్నా.. నిధులు లేని కారణంగా సాయం చేయకపోవటం సమస్యగా మారింది.

దీంతో.. తమ డబ్బుల కోసం తాము ఇంతలా తిరగాల్సిన అవసరం ఏమిటన్న వేదనను ఆర్టీసీ ఉద్యగులు వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర అవసరాల కోసం టీఎస్ ఆర్టీసీకి చెందిన 12 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకూ ఎవరికి చెల్లింపులు చేయటం లేదని చెబుతున్నారు. ఈ తీరుపై ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర వేదన చెందుతున్నారు.