వాట్సాప్ సోషల్ మీడియా డాక్టర్లను నమ్ముకండి.. ప్లీజ్!

Tue May 04 2021 15:00:01 GMT+0530 (IST)

Dont trust WhatsApp and social media doctors

సమాజంలో ఏం జరిగినా.. ముందు నేనున్నానంటూ స్పందించే జనరల్ మీడియా కంటే ముందుగా స్పందించేది సోషల్ మీడియా. విషయం ఏదైనా కానీ.. స్పందనలో మాత్రం ముందున్న మీడియాగా సోషల్ మీ డియాకు చాలా ఫాలోయింగ్ ఉంది. అది వాట్సాప్ కావొచ్చు ట్విట్టర్ కావొచ్చు.. ఫేస్ బుక్ కావొచ్చు.. ఇన్ స్టా గ్రామ్ కావొచ్చు.. లేదా యూట్యూబ్ కావొచ్చు.. ఏదైనా కూడా ప్రజలకు తక్షణ సమాచారం చేరవేయడంతో పాటు.. విశ్లేషణలు వ్యాఖ్యలకు వేదికలుగా మారాయనడంలో సందేహం లేదు.అయితే... ఈ సోషల్ మీడియా వల్ల ప్రయోజనం ఎంత ఉందో.. అంతకుమించిన ప్రమాదమూ ఉందని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కరోనా ఉదృతంగా ఉన్న ప్రస్తుత సమయంలో ప్రజలకు కరోనా బారిన పడుతున్న వారికి సూచనలు సలహాలు అంటూ.. విస్తృతంగా సోషల్ మీడియాలో అనేక అంశాలు పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా కొంత మంది ఈ మధ్య వైద్యులుగా కూడా సోషల్ మీడియాలో చలామణి అవుతున్నారు. తమను తాము ప్రొజెక్టు చేసుకుంటూ.. ఫేమస్ అయ్యేందుకు వాట్సాప్ సోషల్ మీడియాను బాగానే వాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కరోనాకు మందులున్నాయని కరోనాకు నివారణ ఉందని.. ఇలా.. కరోనాను కేంద్రంగా చేసుకుని.. అనేక రూపాల్లో కాంమెట్లు వీడియోలు చేస్తున్నారు. ఇక వీటిని చూసే వారు సైతం పెరుగుతున్నారు. దీంతో వ్యూస్ పెరుగుతున్నాయని భావిస్తున్న సదరు వ్యక్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. దీంతో అమాయక ప్రజలు.. వీటినే నమ్మేస్తున్నారు. తమకు ఆరోగ్యంలో ఏ చిన్న తేడా కనిపించినా.. వాట్సాప్‌నో.. యూట్యూబ్‌నో ఆశ్రయించి.. అందులో సూచించిన విధంగా చేసుకుంటున్నారే తప్ప.. వైద్యులను సంప్రదించడం లేదు.

ఈ క్రమంలో కొందరు ముక్కులో నిమ్మరసం పిండుకోమని చెప్పిన వీడియోను ఎక్కువ మంది ఫాలో అయ్యారు. ఈ విధంగా చేసుకున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు మృతి చెందారు. ఈ ఘటన ఆయన కుటుంబంలో విషాదం నింపింది. వాస్తవానికి ఆయనకు కరోనా రాలేదు. కేవలం జలుబు చేసింది అంతే! అంటే.. యూట్యూబ్ సమాచారం ఆధారంగా ఆయన ప్రాణాల మీదకి తెచ్చుకున్న విషయం గమనార్హం. అంతేతప్ప.. వైద్యుల వద్దకు వెళ్లి టెస్టులుచేయించుకుందామనే ధ్యాస లోపించడం గమనార్హం.

ఇంకొందరు నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు వేసుకుంటున్నారు. ఇవి కూడా ప్రాణాలు పోయేందుకు దారి తీస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు చైతన్య వంతులు కావాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నమ్మి మోస పోవద్దు అని సూచిస్తున్నారు పరిశీలకులు. కేవలం వ్యూస్ కోసం పెట్టే వీడియోలను నమ్మొద్దని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. వాటి లక్షణాలేంటో స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా ఐసీఎంఆర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా తమ వెబ్ సైట్ లోనూ వివరాలు పెడుతున్నాయి. ఒక్క ఫోన్ కాల్‌తో సలహాలు ఇచ్చే సదుపాయాన్ని కూడా చేరువ చేశారు. వీటిని పాటిస్తూ.. టెస్టులు చేయించుకోవడం.. ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించడం వల్ల మాత్రమే.. మనం జాగ్రత్తగా ఉంటామనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.