Begin typing your search above and press return to search.

ఓడిపోతే.. దేశం విడిచి పెట్టి వెళ్లే వాడికి ఓట్లు ఎందుకు వేయాలి?

By:  Tupaki Desk   |   19 Oct 2020 7:30 AM GMT
ఓడిపోతే.. దేశం విడిచి పెట్టి వెళ్లే వాడికి ఓట్లు ఎందుకు వేయాలి?
X
వీరుడు పోరాడతాడు. ఒకవేళ.. ఓటమి ఎదురైతే దాన్ని స్వీకరిస్తాడు. మళ్లీ మరో ప్రయత్నం చేస్తాడు. విజయం కోసం తపిస్తాడు. ఇలాంటి లక్షణాలు తనలో ఏ మాత్రం లేవన్న విషయాన్ని చెప్పకనే చెప్పేయటమే కాదు.. సమయం సందర్భం ఏ మాత్రం లేని బెదిరింపు వ్యాఖ్యలు.. నిరాశాపూరిత మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న వేళ.. ట్రంప్ నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యలు షాకింగ్ గా మారుతున్నాయి.

తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. ట్రంప్ కు భారీ డ్యామేజ్ తెచ్చి పెట్టేవి గా ఉన్నట్లు చెబుతున్నారు. తన ను ఓడిస్తే.. తానేం చేస్తానన్న విషయాన్ని ఆయన నోటి నుంచి విన్న వారంతా..ఇవేం మాటలంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. తాజాగా ఆయన జార్జియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు.
తన పరిస్థితి అంత మెరుగ్గా లేదన్న ఆయన.. తాను ఎన్నికల్లో నెగ్గక పోతే తానేం చేస్తానన్న విషయాన్ని మీరు ఊహిస్తారా? అంటూ ప్రశ్నించినఆయన.. ‘‘బహుశా దేశం విడిచి వెళ్లి పోతానేమో.. నాకు తెలియదు’’ అంటూ వ్యాఖ్యలు చేసి షాకిచ్చారు. ఏదోలా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలన్న తాపత్రయం ట్రంప్ మాటల్లోకనిపిస్తున్నా.. ఈ తరహా వ్యాఖ్యలు ఆయనకు మేలు కంటే కీడే చేస్తాయంటున్నారు.

ఎన్నికల్లో గెలుపు కోసం పోరాటం చేయాల్సిన వ్యక్తి.. పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవటం కోసం ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడతారా? ఇదేం పద్దతి అని ప్రశ్నిస్తున్నారు. ఓవైపు తన ప్రత్యర్థి జో బైడైన్ కు మద్దతు అంతకంతకూ పెరగుతున్న వేళ.. అందుకు భిన్నంగా ట్రంప్ మాత్రం తన మాటలతో తనకు తాను చేటు చేసుకుంటున్నారని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. బైడైన్ గెలిస్తే.. అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసా?అంటూ బెదిరింపులకు దిగుతున్న ఆయన.. కరోనా వ్యాక్సిన్ రాక మరింత ఆలస్యమవుతుందని చెబుతున్నారు. బైడెన్ అధ్యక్షుడౌతే.. అమెరికాను మూసివేస్తారని.. దేశ ప్రజల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తారని వ్యాఖ్యానించిన ట్రంప్.. తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలతో లాభం కంటే నష్టమే ఎక్కువ అంటున్నారు. దేశం విడిచి వెళ్లిపోతానన్న మాటలు సెల్ఫ్ గోల్ గా అభివర్ణిస్తున్నారు. పోరాట పటిమ లేని అధ్యక్షుల వారిని అమెరికన్లు మరోసారి ఎందుకు ఎన్నుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గత ఎన్నికల్లో ట్రంప్ కు విజయాన్ని తెచ్చి పెట్టటంలో కీలకంగా వ్యవహరించిన మిషిగాన్.. విస్కాన్సిన్ రాష్ట్రాల్లోనూ ఆయనకు అనుకూల పరిస్థితి లేదన్న మాట వినిపిస్తోంది.