ఈయన మాట ఎవరైనా నమ్ముతారా ?

Wed Jul 21 2021 10:40:15 GMT+0530 (IST)

Does anyone believe kaushik reddy words

హుజూరాబాద్ నియోజకవర్గంలో బహిష్కరణకు గురైన సీనియర్ నేత కౌశిక్ రెడ్డి మాటలు విచిత్రంగా ఉన్నాయి. ‘తాడిచెట్టు ఎందుకెక్కావంటే దూడ గడ్డి కోసమ’న్నట్లుగా ఉంది రెడ్డి మాటలు. బుధవారం కేసీయార్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరబోతున్న కౌశిక్ చెప్పిన మాట ఇలాగే ఉంది. టీఆర్ఎస్ లో ఎందుకు చేరుతున్నావయ్యా అంటే హుజూరాబాద్ ఉపఎన్నికను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్టించుకోవటంలేదట. అందుకనే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించటం విచిత్రంగా ఉంది.ఇప్పటివరకు హుజూరాబాద్ ఉపఎన్నికకు తేదీనే కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రకటించలేదు. అయినా నియోజకవర్గంలో ఉపఎన్నిక వేడి మాత్రం బాగా పెరిగిపోతోంది. ఎందుకింత తొందరగా వేడి పెరిగిపోయిందంటే మాజీమంత్రి ఈటల రాజేందర్-కేసీయార్ వల్లే అని అందరికీ తెలిసిందే. మంత్రివర్గంలో నుండి బహిష్కరణకు గురైన ఈటల తర్వాత ఎంఎల్ఏగా కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కమలంపార్టీ అభ్యర్ధిగా పోటీ చేయటానికి రెడీ అయిపోయారు.

ఎలాగైనా ఉపఎన్నికలో గెలవాల్సిన అవసరం ఈటలకుంది. అలాగే ఈటలను ఎలాగైనా ఓడించటం కేసీయార్ కు తప్పనిసరైంది. అందుకనే ఇద్దరు నియోజకవర్గంలో ఏదోరూపంలో మంటలు మండిస్తున్నారు. కాబట్టే హుజూరాబాద్ లో ఎన్నికల వాతావరణం వేడెక్కిపోతోంది. అయితే ఉపఎన్నికలో గెలుపుపై ఈటల కేసీయార్ కున్న అనివార్యత కాంగ్రెస్ కు లేదన్నది వాస్తవం. ఇద్దరి మధ్య ఓట్లు చీలిపోయి పోయిన ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో అన్నే ఓట్లు వస్తే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది.

పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా కౌశిక్ సుమారు 62 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ముందు టీఆర్ఎస్ అభ్యర్ధి ఎవరో తేలితే అప్పుడు తాను రంగంలోకి దిగొచ్చని రేవంత్ వ్యూహాత్మకంగా వ్యహరిస్తున్నారు. మామూలుగా అయితే కౌశికే కాంగ్రెస్ అభ్యర్ధయ్యే అవకాశం ఉండేది. కానీ తన అత్యుత్సాహంతో చెడగొట్టుకున్నారు. నియోజకవర్గంలో మండలాలవారీగా నేతలను రేవంత్ ప్రకటించారు. ఇంతకన్నా  ఈ దశలో రేవంత్ చేయగలిగేది ఏమీలేదు. ఉపఎన్నిక తేదీని కమీషన్ ప్రకటిస్తే అప్పుడు రేవంత్ రంగంలోకి దూకుతారు.

ఈమాత్రం కూడా కౌశిక్కు తెలీకుండానే ఉంటుందా ? తాను టీఆర్ఎస్ లో చేరాలని డిసైడ్ అయిపోయారు. దానికి వేదికగా రేవంత్ పై అనవసరంగా బురద చల్లేస్తున్నారు. కౌశిక్ అత్యుత్సాహం వరకు ఓకేనే అసలు ఆయనకు కేసీయార్ టికెట్ ఇస్తారా ? అన్నదే డౌటుగా మారింది. ఎందుకంటే ఎన్నికల్లో పోటీకి వీలుగా ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సాంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శి పదవితో పాటు ప్రభుత్వ సర్వీసుకు కూడా రాజీనామా చేశారనే ప్రచారం జరుగుతోంది. మరి కేసీయార్ ఏమి చేస్తారో చూడాల్సిందే.