Begin typing your search above and press return to search.

సినిమాల్లో మాదిరి రాజకీయాల్లో నడవదన్నది పవన్ కు అర్థం కాదా?

By:  Tupaki Desk   |   13 Nov 2019 5:40 AM GMT
సినిమాల్లో మాదిరి రాజకీయాల్లో నడవదన్నది పవన్ కు అర్థం కాదా?
X
తిరుగు లేని స్టార్ డమ్ ను వదులుకొని రాజకీయాల్లో వచ్చినంతనే అధికారం చేతి కి వస్తుందన్న నమ్మకం జనసేన అధినేత పవన్ లో కాస్త ఉండేదన్న మాట ఆయన సన్నిహితులు చెబుతుంటారు. పైకి అధికారం మీద మోజు లేదని చెబుతూనే.. దాని కోసం ఆయన పడిన తపన అంతా ఇంతా కాదన్న విమర్శ ఉంది. అయితే.. తాను చేసే పనుల్లోనూ.. తీసుకునే నిర్ణయాల్లోనూ తప్పులు దొర్లకుండా ఉండేందుకు తన చుట్టూ ఉన్న వారి నుంచి సరైన ఫీడ్ బ్యాక్ రాకపోవటం.. అలాంటి స్వేచ్ఛ లేని వాతావరణాన్ని క్రియేట్ చేయటంతో పీకే తప్పులు కూడా ఉన్నాయని చెబుతారు.

అంతేకాదు.. పార్టీ తరఫున మాట్లాడే బలమైన గొంతు లేకపోవటం.. ఏం మాట్లాడాలన్నా.. ఎలాంటి విమర్శ చేయాలన్నా తాను తప్పించి మరెవరూ నోరు విప్పకూడదంటూ పెట్టుకున్న రూల్ తో మరింత ఇబ్బంది కరంగా మారినట్లు చెబుతున్నారు. పార్టీలో ఏం మాట్లాడాలన్నా తానే మాట్లాడాలని.. మరెవరూ మాట్లాడేందుకు అవకాశం లేకుండా చేసిన పవన్ తీరుతో జనసేన లో వన్ మ్యాన్ షో నడుస్తున్నట్లు చెబుతున్నారు.

దీనికి తోడు పార్టీ నిర్మాణం నాటి నుంచి పవన్ తప్ప ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరూ ప్రజల్లో రిజిస్టర్ కాని దుస్థితి ఉంది. అధినేత అనే వాడు పార్టీకి కెప్టెన్ గా ఉండాలే తప్పించి.. పార్టీ కి సంబంధించిన ప్రతి పని తానే చేయాలన్నట్లుగా ఉండకూడదు. కానీ.. ఈ విషయంలో పవన్ అనుసరించిన విధానం పార్టీ లో పవన్ కు తప్పించి మరెవరికి గుర్తింపు రాని దుస్థితి నెలకొంది.
దీంతో తన పై ఎవరైనా తీవ్ర విమర్శలు చేసినా.. ఆరోపణలు చేసినా పవనే స్వయం గా వాటిని ఖండించాల్సిన పరిస్థితి. నిన్న విజయవాడ లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత.. సీఎం జగన్మోహన్ రెడ్డి పై పవన్ చేసిన విమర్శల పర్వమే దీనికి చక్కటి ఉదాహరణ. సీఎం జగన్ మీద సెటైర్లు వేసిన కాసేపటికే.. రంగం లోకి దిగిన పేర్ని నాని పవన్ నాయుడు అంటూ చేసిన వ్యంగ్య వ్యాఖ్యల కు ఎవరూ బదులివ్వలేని పరిస్థితి.

దీంతో.. పవన్ దాడికి పేర్ని నాని ఎదురు దాడి సరి సమానంగా ఉండటం తో.. జనసేనానికి ఎలాంటి రాజకీయ ప్రయోజనం కలుగకుండా పోయింది. ఒక రకంగా చూస్తే.. పవన్ మాటల కంటే పేర్ని నాని మాటలే ఎఫెక్టివ్ గా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. సినిమాల్లో హీరో వంద మందినైనా ఒంటి చేత్తో ఎదుర్కోగలడు. సినిమా ఫార్ములా రాజకీయాల్లో నడవదన్న విషయాన్ని పవన్ మిస్ అయినట్లున్నారు. రీల్ హీరో ఎలా అయితే చెలరేగి పోతాడో.. తానొక్కడితోనే అంతా అయిపోతుందన్న భావనలో ఉన్న పవన్ కారణంగా పార్టీలోని వారు తలలు పట్టుకుంటున్న దుస్థితి. మరీ.. మైండ్ సెట్ నుంచి పవన్ ఎప్పుడు బయటపడతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందంటున్నారు జన సైనికులు.