బీజేపీలోనూ కేసీఆర్ కోవర్టులు ఉన్నారని.. అందుకే ఈ పార్టీలోకి చేరికలు నిలిచిపోయాయని.. కమలం పార్టీ ప్రక్షాళన కావాల్సిందేనన్న వ్యాఖ్యలతో ఈటల రాజేందర్ దుమారం రేపారు. సొంత బీజేపీ నేతలే ఈటల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీలో ఉండి ఇలా కేసీఆర్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం పట్ల పార్టీ నేతలు ఈటలపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.
తాజాగా బీజేపీ నుంచి లీక్ అయిన ఓ వార్త రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. బీజేపీలో ఈటలతో ఇద్దరు జాతీయ కార్యవర్గ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఈటలకు వ్యతిరేకంగానే కొంతమందిని ఎగదోస్తున్నారని బయటపడింది.
తాజాగా విజయశాంతి కూడా ఈటల వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈటల చెప్పినట్టుగా నిజంగా కోవర్టులు ఉంటే వారిిన పేర్లతో సహా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిజంగా కోవర్టులు ఉంటే ఢిల్లీలోని బీజేపీ అధిష్టానం కూడా వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆమె చెప్పడంతో ఈటల వ్యవహారం ముదిరిపాకాన పడింది. అలా చేస్తే ఈటలనే పార్టీకి మేలు చేసినవారు అవుతారని విజయశాంతి డిమాండ్ చేశారు.ఊరికే కోవర్టులు ఉన్నారనిచెప్పి తప్పించుకోవద్దని.. విజయశాంతి కౌంటర్ ఇచ్చారు.
ఇక ఈటల వ్యాఖ్యలపై బండి సంజయ్ కూడా స్పష్టతను ఇచ్చారు. బీజేపీలో కోవర్టులు ఎవరూ ఉండరని.. బీజేపీ ఒక సిద్ధాంతం గల పార్టీ అంటూ కామెంట్స్ చేశారు. ఇటీవల కాలంలో పలువురు బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతారని విస్తృతంగా ప్రచారం సాగింది. ఈటల ఆధ్వర్యంలో ఈ చేరికలు ఉంటాయన్నారు.
అయితే ఈటల అన్ని ప్రయత్నాలు చేసినా ఆ చేరికలు లీక్ అయ్యి వాళ్లు బీజేపీలోకి రాలేదు. దీంతో ఈటల బీజేపీలోని కోవర్టుల వల్లే ఇలా జరిగిందని.. అసలు ఇలా జాయినింగ్ కమిటీలు ఉంటే ఎలా బహిరంగంగా వచ్చి చేరుతారని ఈటల వాపోయారు.
బీజేపీలో పరిస్థితిని బయటపెట్టి ఈటల ఆ పార్టీని చిక్కుల్లో పడేశారు. ఈ క్రమంలోనే ఈటలకు మద్దతుగా రేవంత్ మాట్లాడి మరింతగా బీజేపీని ఇరుకునపెట్టారు. దీంతో ఈటల రాజేందర్ ఇక బీజేపీలో కొనసాగడం కష్టమని.. ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.