పెట్రోల్ ధర కంటే బీజేపీ టాక్స్ ఎక్కువ..!!

Mon Feb 22 2021 13:00:10 GMT+0530 (IST)

Do you understand what is the real truth behind the petrol price fire?

రూపాయికి తయారయ్యే వస్తువును ఎంతకు అమ్మితే న్యాయం అంటారు? ధర్మబద్ధమైన వ్యాపారం అంటారు? రూపాయి రూపాయి వేద్దామా? లేదంటే.. రూపాయి మూడు రూపాయిలు కలుపుదామా? అదేంటండి.. ఎంత అన్యాయం కాకుంటే.. రూపాయికి తయారయ్యే వస్తువును.. రూపాయి పది పైసలో.. రూపాయి పావలానో  తీసుకోవాలి కానీ.. రెండు రూపాయిలు.. మూడు రూపాయిలు ఎలా తీసుకుంటారండి? అందరూ ధనికులే ఉండరు కదా? సామాన్యులు ఉంటారు కదా? అన్న ప్రశ్నలు వేస్తారు కదా?మరి.. పెట్రోల్.. డీజిల్ విషయంలో కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల లెక్క.. పైన చెప్పిన ఉదాహరణకు మించి ఉండటం దేనికి నిదర్శనం. లీటరు పెట్రోల్ రూ.100కు దగ్గరకు వచ్చేసి.. డీజిల్ రూ.90ను టచ్ చేస్తున్న వేళ.. అసలు లీటరు పెట్రోల్ తయారు చేయటానికి ఎంత అవుతుంది? లీటరు డీజిల్ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది? మరెంతకు అమ్ముతున్నారో తెలిస్తే.. దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించటం ఖాయం.

ప్రపంచంలో మరే దేశంలోనూ లేని రీతిలో పెట్రోల్.. డీజిల్ మీద అత్యధిక పన్నులు బాదేది మన దేశంలోనే. మూల ధర (సామాన్య జనాలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే.. పెట్రోల్ కొనుగోలు చేసి శుద్ధి చేస్తే అయ్యే ఖర్చు) కంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పేరుతో వడ్డించే పన్నే ఎక్కువ. మన దేశంలో పెట్రోల్... డీజిల్ ధరల్లో 60 శాతానికి పైనే పన్ను వాత ఉంటుందన్న విషయం మీకు తెలుసా?

పెట్రోల్ మీద అయితే అక్షరాల పన్నుల రూపంలో కేంద్రం బాదే బాదుడు అక్షరాల రూ.32.90. దీనికి అదనంగా వ్యాట్ పేరుతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు మరో 36 శాతం మేర భారం మోపుతుంటాయి. ఇది సరిపోదన్నట్లుగా కొన్ని రాష్ట్రాలు వ్యాట్ కు అదనంగా లీటరుకు రూపాయి.. రెండు రూపాయిల చొప్పున పన్ను వేసేస్తుంటారు. కొన్ని రాష్ట్రాలైతే లీటరుకు రూ.4వసూలు చేసేవి కూడా ఉన్నాయి. అసలు లీటరు పెట్రోల్ ను విదేశాల్లో కొని.. శుద్ధి చేయటానికి ఎంత ఖర్చు అవుతుందన్న లెక్కలోకి వెళితే.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు బాదే బాదుడు లెక్క ఇట్టే అర్థమవుతుంది.

అంతర్జాతీయ విపణిలో ఒక బ్యారెల్ బ్రెంట్ ముడిచమురు దగ్గర దగ్గర 63 డాలర్లు. ఒక బ్యారెల్ అంటే 159 లీటర్లు. అంటే.. శుద్ధి చేయకుండా ఉండే ముడిచమురు ధర లీటరు రూ.28.74. దాన్నిశుద్ధి చేసి.. ప్రాసెసింగ్ చేస్తే లీటరుకు అయ్యే ఖర్చు రూ.3.84. ఈ రెండింటిని కలిపితే లీటరు పెట్రోల్ కు అయ్యే ఖర్చు రూ.32.58. దీనికి కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీ లీటరుకు రూ.32.90. అంటే.. పెట్రోల్ తయారు చేసే దాని కంటే ఎక్కువ సొమ్మును కేంద్రం పన్ను రూపంలో బాదేస్తోంది.

ఇక.. లీటరు పెట్రోల్ అమ్మటానికి డీలర్ కు ఇచ్చే లాభం రూ.3.24. పెట్రోల్ తయారీకి.. కేంద్రం వేసే పన్నులతో పాటు.. వ్యాపారి లాభాన్నికలిపితే లీటరు పెట్రోల్ కు అయ్యే ఖర్చు రూ.68.72. దీనికి అదనంగా రవాణా చార్జీ లీటరుకు 19 పైసలు. ఇది సరిపోదన్ననట్లుగా రాష్ట్రాలు విధించే వ్యాట్ 35.2 శాతం. ఈ మొత్తాన్ని కలిపితే లీటరు పెట్రోల్ రూ.92 వరకు అవుతుంది. అంటే.. అసలు కంటే కొసరు ఎక్కువన్నట్లు.. చమురు కొనుగోలు చేసి దాన్ని శుద్ధి చేస్తే అయ్యే దానికి మించిన మొత్తాన్ని కేవలం పన్ను పేరుతో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా బాదేయటం చూస్తే.. పెట్రోల్ ధర మంట వెనుక అసలు నిజం ఏమిటో అర్థమైందా?