Begin typing your search above and press return to search.

సూర్యుడు మొద‌ట‌గా ఉద‌యించే ఊరిని చూస్తారా?

By:  Tupaki Desk   |   18 July 2021 6:48 AM GMT
సూర్యుడు మొద‌ట‌గా ఉద‌యించే ఊరిని చూస్తారా?
X
ఈ ప్ర‌పంచంలో సూర్యుడు ముందుగా ప్ర‌కాశించే దేశం ఏంటో తెలుసా? జ‌పాన్ అని చాలా మందికి తెలిసి ఉంటుంది. తూర్పుదేశంగా ఉన్న జ‌పాన్ లోనే తొలిసారిగా సూర్య‌కిర‌ణాలు ప‌డ‌తాయి. మ‌రి, మ‌న దేశానికి వ‌చ్చిన‌ప్పుడు.. భానుడు తొలిగా ఉద‌యించేది ఏ రాష్ట్రంలో? ఈ ప్ర‌శ్న‌కు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ అని కూడా చాలా మంది చెప్పొచ్చు. మ‌రి, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో ఏ ఊరిలో తొలిగా సూర్యుడు ఉద‌యిస్తాడు? అంటే మాత్రం.. చాలా మంది స‌మాధానం చెప్ప‌లేరు. ఆ ఊరు విశేషాలేంటీ అన్న‌ది చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు ఎప్పుడు ఉద‌యిస్తాడు అంటే.. 6 గంట‌ల‌ త‌ర్వాతే. కానీ.. ఆ ఊరిలో మాత్రం 5 గంట‌ల‌కే త‌లుపు త‌డ‌తాడు! అంటే.. చాలా వ‌ర‌కు దేశం నిద్ర‌లో ఉండ‌గానే.. ఈ ఊరు నిద్ర‌లేస్తుంద‌న్న‌మాట‌. అదే.. దోంగ్ గ్రామం. అరుణాచ‌ల్ లోని తూర్పు భాగం చివ‌రలో ఉండే ఈ గ్రామంలోనే తొలిసారిగా సూర్య కిర‌ణాలు ప్ర‌స‌రిస్తాయి. ఆ లెక్క ప్ర‌కారం.. చీక‌టి కూడా త్వ‌ర‌గానే ప‌డిపోతుంది. శీతాకాలంలోనైతే 4.30 గంట‌ల‌కే సూరిగాడు టాటా చెప్పేసి వెళ్లిపోతాడు.

భూమి త‌న చుట్టు తాను తిరుగుతూ సూర్యుడి చుట్టు తిరుగుతుంద‌ని చదువుకున్నాం. ఈ క్ర‌మంలోనే రాత్రి ప‌గ‌లు, ఏర్ప‌డ‌తాయి. ఇలా తిరిగివ‌చ్చే క్ర‌మంలో మ‌న దేశంలోని దోంగ్ లో మొద‌టి భానుడి కిర‌ణాలు ప‌డ‌తాయి. ఆ త‌ర్వాత పొద్దు పొడుస్తున్న కొద్దీ.. (అంటే భూమి ముందుకు తిరుగుతున్న కొద్దీ) ఒక్కో ఊరు నిద్ర లేస్తుంద‌న్న‌మాట‌. అయితే.. ఇత‌ర ప్రాంతాల్లోని వారికి ఆశ్చ‌ర్యం ఎప్పుడు క‌లిగిస్తుందంటే.. టైమ్ తో పోల్చి చూసుకున్న‌ప్పుడు వింత‌గా అనిపిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో కాలాన్ని బ‌ట్టి స‌గ‌టున‌ సాయంత్రం 6 త‌ర్వాత‌గానీ చీక‌టి ప‌డ‌దు. కానీ.. దోంగ్ లో నాలుగున్న‌ర‌కే సూర్యుడు వెళ్లిపోతాడు. ఇలా.. టైమ్ తో పోల్చి చూసిన‌ప్పుడు ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంది. దీనికి కార‌ణం ఏంట‌న్న‌ది కూడా చాలా మందికి తెలిసిందే. ఆ ఊరు.. మ‌న‌కు కొన్ని వేల‌ కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. ప‌క్కాగా చెప్పాలంటే.. హైద‌రాబాద్ నుంచి అరుణా చ‌ల్ ప్ర‌దేశ్ లోని దోంగ్ గ్రామం 3 వేల 148 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. ఈ కార‌ణం వ‌ల్ల‌నే.. అక్క‌డ 5 గంట‌ల‌కు పొద్దు పొడిస్తే.. మ‌న వంతు వ‌చ్చే స‌రికి 6 దాటిపోతుంది. ఇంత డీప్ గా చ‌ర్చించిన‌ప్పుడు ఇది సాధార‌ణ విష‌యంగా అనిపిస్తుంది. కానీ.. ఈ విష‌యాన్ని ఓవ‌రాల్ గా చూసిన‌ప్పుడు వింత‌గా అనిపిస్తుంది.

ఈ వింత‌ను చూడ‌డానికే ఎంతో మంది ప‌ర్యాట‌కులు దోంగ్ గ్రామాన్ని సంద‌ర్శిస్తూ ఉంటారు. దోంగ్ ఊరు చాలా చిన్న‌ద‌. ప‌దేళ్ల క్రితం ఇక్క‌డ కేవ‌లం నాలుగు కుటుంబాలు మాత్ర‌మే నివాసం ఉండేవి. ప‌దిహేను మంది మాత్ర‌మే ఇక్క‌డ ఉండేవారు. ఇప్పుడు మాత్రం ఆ సంఖ్య పెరిగింది. దేశంలో ముందుగా సూర్యుడు ఉద‌యించే ప్రాంతాన్ని చూసి వ‌చ్చామ‌ని సంబ‌ర‌ప‌డే జ‌నాల సంఖ్య పెరుగుతూ ఉండ‌డంతో.. ఇక్క‌డ నివ‌సించే వారి సంఖ్య కూడా పెరుగుతూ వ‌స్తోంది. అయితే.. ఈ ప్రాంతం కేవ‌లం సూర్యుడు ముందుగా ఉద‌యించే ప్రాంతంగానే కాకుండా.. అద్భుత‌మైన ప్ర‌కృతి సౌంద‌ర్యానికి నెల‌వు.

సినిమా పాట‌ల్లో క‌వులు వ‌ర్ణించే వెండి కొండ‌లు.. బంగారు ప‌ర్వతాలు ఇక్క‌డ క‌నిపిస్తుంటాయి. సూర్యోద‌యం వేళ మంచు కొండ‌లు బంగారు వ‌ర్ణాన్ని సంత‌రించుకుంటాయి. ఆ త‌ర్వాత ధ‌వ‌ళ వ‌ర్ణంలో మెరిసిపోతుంటాయి. ఇక‌, జ‌ల‌జ‌లా పారే సెల‌యేళ్లు.. ప‌చ్చ‌టి చెట్లు..ప్ర‌కృతి ప్రేమికుల‌ను మైమ‌ర‌పింప‌జేస్తాయి. అందుకే.. ఒకేసారి రెండు అద్భుతాల‌ను వీక్షించామ‌ని అనుభూతి చెందేందుకు ఇక్క‌డ‌కు వెళ్లివ‌స్తుంటారు ప‌ర్యాట‌కులు.

అయితే.. ఇంకా పూర్తిగా ప‌ర్యాట‌కం వృద్ధి చెంద‌లేదు. అందుకే.. ఇక్క‌డ ప‌ర్యాట‌కులు ఉండ‌డానికి ఏర్పాట్లు లేవు. అంటే.. పొద్దున వెళ్తే.. సాయంత్రం లోపు తిరుగు ట‌పా క‌ట్టేయాల‌న్న‌మాట‌. ఈ గ్రామానికి దూరంగా ఉండే ‘వాలాంగ్’ వంటి పట్టణాల్లో పర్యాటకులు బస చేస్తారు. ఆ త‌ర్వాత తెల్ల‌వారు జామున 3 గంట‌ల స‌మ‌యంలో ఆ గ్రామానికి వెళ్లేందుకు బ‌య‌లుదేరుతారు. కొంద‌రు వాహ‌నాల ద్వారా అక్క‌డికి చేరుకుంటే.. మ‌రికొంద‌రు సాహ‌స‌వంతులు ట్రెక్కింగ్ ను మార్గంగా ఎంచుకుంటారు.

ఇటు టిబెట్‌, అటు చైనా స‌రిహ‌ద్దులుగా ఉండే ఈ గ్రామం.. స‌ముద్ర మ‌ట్టానికి 1240 మీట‌ర్ల ఎత్తులో ఉంటుంది. మంచు ప‌ర్వ‌తాల్లో ఉండే ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించిన వారికి ఇత‌ర చ‌లి దేశాల్లో ప‌ర్య‌టిస్తున్నంత అనుభూతి క‌లుగుతుందంటే అతిశ‌యోక్తి కాదు. అవ‌కాశం ఉంటే.. అద్భుత‌మైన ప్రాంతాల‌ను సంద‌ర్శించాల‌ని భావిస్తే.. మీరు కూడా ఈ ప్రాంతాన్ని చుట్టేసి రండి. ఓ మ‌ధుర జ్ఞాప‌కంగా త‌ప్ప‌క మిగిలిపోతుంది.