కరోనాతో కోలుకున్నాక ఇవి తప్పవు.. వీటిని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు

Sun May 16 2021 16:00:01 GMT+0530 (IST)

Do not ignore these after recovering with Corona

కొవిడ్ తో కోలుకున్నాక కూడా ఈ తిప్పలు తప్పవు.. జర జాగ్రత్త!పేరుకు మూడు అక్షరాలే కానీ.. ఒకసారి తగులుకుంటే అంత తేలిగ్గా పోని రోగంగా కోవిడ్ ను చెప్పాలి. మొదటి వేవ్ తో పోలిస్తే.. రెండో వేవ్ లో విరుచుకుపడిన ఈ మహమ్మారి తీవ్రత ఊహించనంత ఎక్కువగా ఉంటుందన్నది మర్చిపోకూడదు. గతంలో కొవిడ్ అంటే వారం.. పది రోజులకు నయమయ్యేది. ఇప్పుడు రెండు వారాలు కనీసం.. నాలుగు వారాల వరకు వెంటాడుతోంది. అక్కడితో ఫుల్ స్టాప్ పడినట్లు కాదు. కొవిడ్ అనంతర ఆరోగ్య ఇబ్బందులు తప్పని పరిస్థితి.అయితే.. వీటిల్లో కొన్నింటి గురించి ఎక్కువ గాబరా పడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో.. మరికొన్ని సమస్యల విషయంలో అత్యంత జాగరూకతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ చిన్న తేడా వచ్చినా.. మరిన్ని ఇబ్బందులు తప్పవన్నది మర్చిపోకూడదు.

కరోనాతో కోలుకున్న తర్వాత కూడా దీర్ఘకాలం వేధించే ఆరోగ్య సమస్యలు కొన్ని ఉంటాయని.. వాటి విషయంలో ఎక్కువ ఆందోళన చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. కొవిడ్ బారిన పడిన తర్వాత ఎదురయ్యే ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే..

- 99-100 డగ్రీల లోపు జ్వరం రావటం
- ఒళ్లు నొప్పులు
- తలనొప్పి
- కీళ్ల నొప్పులు
- నీరసం
- అలసట
- చిన్న విషయాలకు కంగారు పడటం
- ఏకాగ్రతత తగ్గటం
- ఆకలి తక్కువగా ఉండటం
- కళ్లు తిరగటం లాంటి సమస్యలు ఉంటాయి. వీటికి అట్టే కంగారు పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం ఎంత ఉందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవటం.. 94 శాతం కంటే తక్కువగా ఉంటే వైద్యుడ్ని సంప్రదించటం చేయాలి. కాళ్లల్లో వాపులు ఉన్నా.. దగ్గు పెరుగుతున్నా.. ఛాతీ నొప్పి వచ్చినా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. తరచూ నీటిని తీసుకోవటం తప్పనిసరి.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత శారీరక శ్రమ అధికంగా చేయొద్దు. గతంలో ఎంత సమయం వ్యాయామం చేసేవారో.. అందులో 30 - 50 శాతం మాత్రమే కేటాయించాలన్నది మర్చిపోకూడదు. ఆరు నుంచి ఎనిమిది వారాలు ఈ విధానాన్ని అనుసరించాలి. షుగర్.. బీపీ.. థైరాయిడ్ లాంటి సమస్యలు ఉంటే మందుల్ని కంటిన్యూ చేయాలి. తగినంత ఆహారాన్ని తీసుకోవటం.. రోజుకు ఎనిమిది గంటలు నిద్ర పోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అర్థరాత్రిళ్లు ఎక్కువగా మేల్కొనకూడదు. ఆందోళనకు గురి చేసే అంశాల జోలికి పోకుండా.. సరదాగా ఇష్టమైన వాటిని చూసేలా ప్లాన్ చేసుకోవాలి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్య సాయం అవసరమన్నది మర్చిపోకూడదు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే మాత్రం.. ఆలస్యం చేయకూండా వైద్యుడ్ని సంప్రదించటం తప్పనిసరి.

- నడిచినప్పుడు ఆయాసంగా ఉండటం
- చేతులు నీలి రంగులోకి మారటం
- జ్వరం 101 డిగ్రీలు దాటటం
- తీవ్రమైన దగ్గు నాన్ స్టాప్ గా ఉండటం
- మాటలు తడబడటం
- ఛాతీలో పట్టేసినట్లుగా ఉండటం
- భరించలేని తలనొప్పి.. వాంతులు
- కళ్ల నొప్పి.. కనుగుడ్డు లాగేసినట్లు ఉండటం
- కళ్లు మసకబారటం
- కాళ్ల వాపులు
- నోటి పూత
- నిద్ర రాకపోవటం
- మానసిక ఒత్తిడి పెరిగిపోవటం