బ్రేకింగ్.. దేవినేని ఉమాకు హైకోర్టులో ఊరట..

Thu Apr 22 2021 17:00:02 GMT+0530 (IST)

Do not arrest Devineni Uma High Court orders CID

టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు.. హైకోర్టులో భారీ ఊరట లభించింది. సీఐడీ పోలీసులు ఉమాను అరెస్టు చేయరాదని.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అదేసమయంలో ఉమా ఆరోగ్యం కుదుట పడేవరకు ఆయనను విచారించవద్దని కూడా ఆదేశించింది. ఇక ఉమా కూడా సీఐడీ అధికారులకు సహకరించాలని.. వారి విచారణకు హాజరు కావాలని తేల్చి చెప్పింది. దీంతో ఉమాకు హైకోర్టు నుంచి భారీ ఊరట లభించినట్టేనని టీడీపీ నేతలు భావిస్తున్నారు.తిరుపతి పార్లమెంటు స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా నెల్లూరులో ప్రచారం చేసిన దేవినేని ఉమా.. మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ గతంలో తిరుపతి ని దూషించారంటూ.. ఓ వీడియో ప్రసారం చేశారు. అయితే.. జగన్ అనని మాటలను చేయని వ్యాఖ్యలను దేవినేని ప్రచారం చేసి.. ముఖ్యమంత్రి గౌరవానికి భంగం కలిగించారని ఆరోపిస్తూ.. వైసీపీ సానుభూతి పరుడు ఒకాయన.. సీఐడీ అధికారులకు ఉమాపై ఫిర్యాదు చేశారు.

వెంటనే రంగంలోకి దిగిన కర్నూలు జిల్లా సీఐడీ అధికారులు ఉమాపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతోపాటు.. ఆయనను వెంటనే విచారణకు హాజరుకావాలంటూ.. నోటీసులు జారీ చేయడం.. అవి వివాదానికి దారితీయడం తెలిసిందే. ఇక మూడో సారి కూడా నోటీసులు జారీ చేసిన అధికారులు.. విజయవాడ సమీపంలోనిగుంటు పల్లిలో ఉన్న ఉమా ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో హైకోర్టును ఆశ్రయించిన ఉమాకు న్యాయస్థానంలో ఊరట లభించింది. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల 7వతేదీకి వాయిదా వేసింది.