Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే తొలి శాఖాహార నగరం..మన వద్దే

By:  Tupaki Desk   |   3 April 2020 3:30 AM GMT
ప్రపంచంలోనే తొలి శాఖాహార నగరం..మన వద్దే
X
భారతదేశంతోపాటు ప్రపంచంలోని అన్ని దేశాల్లో శాఖాహారంతో పాటు మాంసాహారం భుజించే వారు అధికంగా ఉంటారు. మాంసాహార ప్రియులు తమ వారం మెనూ ముక్కలు ఉండేలా చూసుకుంటారు. శాఖాహారం తిన్నవారంతా ఒకరోజు మాంసాహారం తినేందుకు ఆసక్తి చూపుతారు. అందుకే ఆర్థిక వ్యవస్థలో మాంసాహార మార్కెట్‌ కు ప్రాధాన్యం ఉంది. మాంసాహారంతో పాటు దాని అనుబంధంగా మిగతా వ్యాపారాలు కూడా కొనసాగుతుంటాయి. అయితే ప్రపంచంలోనే అత్యధికంగా మాంసాహారం తినే దేశంలో భారతదేశం టాప్‌ లోనే ఉంటుంది. అలాంటి భారతదేశంలోనే ప్రపంచంలోనే తొలి శాఖాహార నగరం ఒకటి ఉంది. అయితే ఆ నగరం ప్రపంచంలోనే తొలి శాఖాహార నగరంగా గుర్తింపు పొందడం విశేషం.

అది ఎక్కడో కాదు మనదేశంలోని గుజరాత్ రాష్ట్రం భావనగర్ జిల్లాలో ఉన్న ‘పాలిటానా’ ఒక చిన్న నగరం ఇది. గుజరాత్‌ రాష్ట్రంలో అత్యధికంగా హిందూవులు ఉంటుంటారు. పైగా హిందూవులు (మార్వాడీలు) - జైనులు - ఇతర మతాలకు చెందిన వారు పెద్ద ఎత్తున ఉంటారు. అయితే జైనమతస్తులు శాఖాహారులు. వారు జంతుహింసను ప్రోత్సహించరు. చివరకు చీమలు - క్రిములు కూడా నోటిలోకి వెళ్తే జంతుబలి చేసినట్లు అని భావించి నోటికి గుడ్డ కట్టుకుంటారు. అలాంటి వారు నివసించే నగరం ‘పాలిటానా’. జైనులకు ఆ నగరం ఎంతో స్వచ్ఛంగా - క్షేత్రంగా పరిగణిస్తున్నారు. ఈ నగరంలో జంతువులను చంపడం చట్ట విరుద్ధం. గుడ్లు - మాంసం విక్రయాలు కూడా నిషేధం.

ఈ నగరంలో ఎప్పటి నుంచో జంతు బలి నిషేధం విధిస్తున్నారు. 2014 సంవత్సరంలో పాలిటానా ప్రాంతంలో జంతువుల వధపై పూర్తి నిషేధం విధించారు. అప్పటి నుంచి ఇక్కడ ఒక్క జంతువును కూడా బలి చేయలేదు. అప్పట్లో ఆ ప్రాంతంలో సుమారు 200 మంది సన్యాసులు జంతువుల బలిని వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేసి ఆందోళన చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి ఆ ప్రాంతంలో జంతువు వధతో పాటు మాంసాహారం వినియోగాన్ని కూడా నిషేధించారు. అంటే ఇతర చోట నుంచి మాంసం తీసుకుని వచ్చి తినడం కూడా వ్యతిరేకించారు. నగరంలో మాంసాహారం కనిపిస్తే తాము ప్రాణత్యాగానికైనా సిద్ధమని సన్యాసులు ప్రకటించడంతో గుజరాత్‌ ప్రభుత్వం వారి డిమాండ్లు నెరవేర్చింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో మొత్తం మాంసాహార కార్యకలాపాలు నిషేధించారు.

ఆ ప్రాంతంలో ఉన్న మొత్తం 250 మాంసాహార దుకాణాలను మూసివేశారు. దీంతో ప్రస్తుతం ఆ నగరంలో మాంసం ఎక్కడా కనిపించడం లేదు. పూర్తి శాఖాహార ప్రాంతంగా గుర్తించారు. కేవలం అక్కడ పాల ఉత్పత్తులను మాత్రమే అనుమతించారు. అక్కడి ప్రజలు పాలు - నెయ్యి - వెన్న మొదలైన పదార్థాలు మాత్రమే తీసుకుంటారు. ఈ ప్రాంతంలో వందలాది దేవాలయాలు ఉండడంతో కూడా ఈ ప్రాంతాన్ని దైవ నిలయంగా భావిస్తూ పాలిటానాలో మాంసాహారం బంద్‌ చేయించారు. దీంతో ఇప్పుడు ఆ ప్రాంతం ప్రపంచంతోపాటు దేశంలోనే తొలి శాఖాహార నగరంగా గుర్తింపు పొందింది.