గెలిచిన రెండేళ్లకు ఓటర్లకు డబ్బులు పంచారుగా?

Sat Nov 21 2020 19:00:49 GMT+0530 (IST)

Distributed money to voters for two years of winning?

ఎప్పుడూ వినని ఒక విచిత్రమైన ఉదంతం ఒకటి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది. సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటు వేసే ఓటరుకు అంతో ఇంతో ముట్టజెప్పటం.. కానుకలు ఇస్తుంటారు. నిబంధనల ప్రకారం అది తప్పైనా.. దాన్ని పట్టించుకునే నేత ఎక్కడా కనిపించరు. ఎక్కడో ఒకరో.. ఇద్దరో ఉన్నా.. వారు ఎన్నికల మీద చూపించే ప్రభావం ఎంతన్నది అందరికి తెలిసిందే. ఎన్నికలు మొత్తం డబ్బుల మయంగా మారిపోయింది.ఎన్నికలు పూర్తైన రెండేళ్ల తర్వాత ఓటర్లకు డబ్బులు పంచిన విచిత్రమైన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. స్థానిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చోటు చేసుకున్న పరిణామాలతో ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఇంతకూ అసలేం జరిగిందంటే.. మిర్యాలగూడ మండలంలో జప్తీవీరప్పగూడెం అనే చిన్న పంచాయితీ ఉంది. రెండేళ్ల క్రితం ఆ గ్రామంలో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా శ్రీలత అనే మహిళ పోటీ చేశారు.

ఎన్నికల్లో పోటీ లేకుండా తనను సర్పంచ్ గా ఎన్నుకుంటే గ్రామంలో జరిగే డెవలప్ మెంట్ కోసం రూ.30లక్షలు ఇస్తానని మాట ఇచ్చారు. దీంతో.. ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు రూ.30లక్షల మొత్తాన్ని గ్రామానికి చెందిన ఇద్దరు పెద్దమనుషుల వద్ద పెట్టారు. గ్రామంలోని పురాతన రామాలయం పక్కనే స్థలం కొని గుడి కట్టాలని భావించారు.

అయితే.. రెండేళ్లుగా ఈ పంచాయితీ తేలకపోవటం.. అక్కడి భూమి వివాదం కావటంతో రూ.30లక్షలుఏమయ్యాయన్న మాట పెద్ద విషయంగా మారింది. దీంతో.. మాట తేడా రావటాన్ని ఇష్టపడని వారు.. గ్రామంలోని 963 ఓటర్లకు రూ.30లక్షల మొత్తాన్ని లెక్కపెట్టి ఒక్కొక్కరికి రూ.3200 చొప్పున పంచేశారు. దీనిపై ఫిర్యాదు చేయటానికి గ్రామానికి చెందిన కొందరు పోలీసుల్ని ఆశ్రయించగా.. సదరు అంశాన్ని గ్రామస్థులే సెటిల్ చేసుకోవాలని చెప్పి పంపేశారు.