వచ్చేస్తోంది.. ఆ బ్రిడ్జి.. ఏపీ తెలంగాణ మధ్య తగ్గిపోనున్న దూరం!

Thu Dec 01 2022 12:06:06 GMT+0530 (India Standard Time)

Distance between AP and Telangana Krishna River Bridge

ఇక ఏపీ తెలంగాణ మధ్య దూరం తగ్గిపోనుంది. కృష్ణా నదిపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఐకానిక్ వంతెనను నిర్మించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గిపోతుంది. అంతేకాకుండా పర్యాటక రంగానికి కూడా బూస్ట్ లభిస్తుందని చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం- తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల మధ్య దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ ఐకానిక్ వంతెన నిర్మిస్తారని తెలుస్తోంది. కేబుల్ ఆధారిత సస్పెన్షన్ వంతెనగా నిర్మించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఆమోదించడంతో త్వరలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం పట్టాలెక్కనుంది.

ఈ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. అలాగే పర్యాటకానికి కూడా లాభం కలిగేలా ఈ వంతెన నిర్మించనున్నారు. రూ.1082.65 కోట్లతో ఈ వంతెనను నిర్మిస్తారు. ఈ వంతెన నిర్మాణ ప్రణాళికను ఇప్పటికే కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ ఆమోదించింది. మొదటి విడతగా రూ.436 కోట్లు నిధులను కూడా మంజూరు చేసింది.  కాగా వంతెన నిర్మాణాన్ని రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్నారు.  

ఈ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణంతో నంద్యాల జిల్లాలో కృష్ణా నది వరద ముంపు బాధిత గ్రామాల ప్రజలకు ఊరట లభిస్తుంది. ఇక పర్యాటకంగా నల్లమల ప్రాంతంలో శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్‌వాటర్‌లో విహరించే సందర్శకులకు ఈ వంతెన పెద్ద ఆకర్షణగా నిలవనుందని చెబుతున్నారు.

ఈ వంతెనపై ప్రత్యేకంగా అద్దాల నడక దారిని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఇక్కడ నుంచి శ్రీశైలం ఆలయ శిఖరం చూడొచ్చు. పైలాన్ ఎల్‌ఈడీ లైట్ల కాంతులతో ఇది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందని సమాచారం.

కాగా  కృష్ణా నదిపై కొత్త వంతెన నిర్మాణ ప్రతిపాదన 2008 నుంచి పెండింగులో ఉంది. 2007లో నాటు పడవలో కృష్ణా నదిని దాటుతూ ప్రమాదానికి గురై 61 మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. దీంతో సిద్ధేశ్వరం –  సోమశిల మధ్య వంతెన నిర్మించాలని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో శంకుస్థాపన కూడా చేశారు. 2009లో ఆయన మృతి చెందడంతో దాని నిర్మాణం నిలిచిపోయింది. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా దీన్ని పట్టించుకోలేదు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ ఎన్‌హెచ్–167కె గా ప్రకటించి కృష్ణా నదిపై ఐకానిక్ వంతెనతో సహా ఆరు లేన్ల రహదారిని నిర్మించనున్నారు.  

తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల బైపాస్ రోడ్డు వరకు 174 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల జాతీయ రహదారి (ఎన్‌హెచ్–167కె)ని రూ.1200 కోట్లతో నిర్మించేందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ అంగీకరించింది.

ఈ వంతెన నిర్మాణంతో నంద్యాల జిల్లాలోని ముంపు గ్రామాల ప్రజలు నదిలో ప్రయాణించాల్సిన అవసరం లేకుండానే రోడ్డు అనుసంధానం ఏర్పడుతుంది. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు నందికొట్కూరు పడిగ్యాల కొత్తపల్లి మండలాల్లోని దాదాపు 35 గ్రామాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది.

ప్రస్తుతం నంద్యాల నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే కర్నూలు వనపర్తి మీదుగా వెళ్లాల్సి వస్తోంది. ఈ వంతెన నిర్మిస్తే నంద్యాల నుంచి నేరుగా నాగర్‌కర్నూలు మీదుగా హైదరాబాద్ వెళ్లిపోవచ్చని చెబుతున్నారు. తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కూడా వ్యయ ప్రయాసలు తగ్గుతాయని సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.