వినుకొండ వైసీపీలో రచ్చరచ్చ

Thu Jan 20 2022 18:00:01 GMT+0530 (IST)

Discussion in Vinukonda YCP

అధికార వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య మొదలైన రచ్చలో ఎంపీ కూడా చేరడంతో ఈ పంచాయితీ సీఎం దక్కరికి చేరిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు వినుకొండ వైసీపీలో ఈ రచ్చకు కారణమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.గుంటూరు జిల్లాలో వినుకొండ ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.  గత ఎన్నికల్లో వినుకొండ నుంచి వైసీపీ తరుఫున పోటీచేసిన బొల్లా బ్రహ్మనాయుడు గెలిచారు. మొదట్లో వినుకొండ వైసీపీలో అంతా బాగానే ఉన్నా కొద్ది నెలలకే విభేదాలు బయటపడ్డాయి.

మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుల మధ్య గొడవలు మొదలయ్యాయి. మొదట్లో అన్ని కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్న ఈ ఇద్దరూ తర్వాత ఎడమొహం.. పెడముఖంగా మారిపోయారు. ఇద్దరూ కలిసి ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయుడు వినుకొండ వస్తేనే మాజీ ఎమ్మెల్యే మక్కెన కనిపించేవారు.

కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మక్కెనను వైసీపీలోకి తీసుకురావడంలో నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు పాత్ర ఉంది. మక్కెన రాకను బొల్లా ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు.  ఎమ్మెల్యే బొల్లాతో విభేదాల తర్వాత ఎంపీతో మక్కెన సాన్నిహిత్యం మరింత పెరిగింది.

ఇది గ్రహించిన ఎమ్మెల్యే బొల్లా వినుకొండలో పట్టు పెంచుకునే పనిలో పడ్డారు. అలాగే తమ వర్గాన్ని ఎమ్మెల్యే బొల్లా పట్టించుకోవడం లేదన్నది మక్కెన వర్గం ఆరోపణ. నియోజకవర్గంలోని సమస్యలపై మాజీ ఎమ్మెల్యే మక్కెన నేరుగా ఎంపీతో మాట్లాడడం.. ఎంపీ కూడా ఆయనకు అనుకూలంగా ఉండడంతో ఎమ్మెల్యే బొల్లాకు ఆగ్రహం తెప్పించిందన్న టాక్ ఉంది.

ఇటీవల వైసీపీ కార్యకర్త రైతు అయిన నరేంద్ర ధాన్యం కొనుగోళ్లపై ఎంపీకి ఫిర్యాదు చేశారు. ఎంపీ వెంటనే జేసీకి ఫోన్ చేసి ధాన్యం కొనుగోళ్ల వ్యవమారంపై ప్రశ్నించారు. ఇది ఎమ్మెల్యే ను మండించిందట.. మక్కెనను వెనకేసుకు వస్తున్నారని.. ఎంపీ మీద  కోపంతో ఉన్న ఎమ్మెల్యే బొల్లాకు.. ఈ పరిస్థితి మరింత ఆగ్రహం తెప్పించిందట.. నరేంద్రపై తీవ్రంగా విరుచుకుపడ్డారట.. నరేంద్ర మాజీ ఎమ్మెల్యే మక్కెన అనుచరుడు.. తనకు చెప్పకుండా ఎంపీకి ఫిర్యాదు చేయడంపై ఎమ్మెల్యే బొల్లా సీరియస్ అయ్యారు. ఇది పోలీస్ కేసు వరకూ వెళ్లింది. నరేంద్రపై ఎమ్మెల్యే కేసు పెట్టించాడట.. ఇందులో ఎంపీ కలుగచేసుకొని పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేయడంతో వినుకొండ రూరల్ సీఐని సస్పెండ్ చేశారు.

దీంతో ఈ వివాదం ఏకంగా సీఎం ముందుకు పంచాయితీ పెట్టారు ఎమ్మెల్యే బొల్లా.. ఎంపీ సస్పెండ్ చేయించిన సీఐకి సీఎం ద్వారా ఎమ్మెల్యే బొల్లా తిరిగిపోస్టింగ్ ఇప్పించుకున్నారట.. ఇప్పటివరకూ  లోలోపల నడిచిన ఈ రెండు వర్గాల లోల్లి ఇప్పుడు బస్తీ మే సవాల్ అనేంతగా తీవ్రమైంది. ఇప్పుడు వైసీపీలో ఈ వ్యవహారం రచ్చకు దారితీసింది.