Begin typing your search above and press return to search.

తెలంగాణ బ్యాచ్ అలా.. బంగారు తెలంగాణ బ్యాచ్ మరోలా

By:  Tupaki Desk   |   29 May 2022 8:30 AM GMT
తెలంగాణ బ్యాచ్ అలా.. బంగారు తెలంగాణ బ్యాచ్ మరోలా
X
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లో ఇంతకు ముందెన్నడూ చోటు చేసుకోని సరికొత్త సన్నివేశం ఒకటి ఆవిష్కృతమైంది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల ప్రారంభం ఇందుకు వేదికైంది. టీఆర్ఎస్ లో ఉద్యమ తెలంగాణ బ్యాచ్ ఒకటి.. రాష్ట్ర సాధన అనంతరం ఇతర పార్టీలకు చెందిన పెద్ద ఎత్తున నేతలు పార్టీలోకి రావటం.. వారందరిని బంగారు తెలంగాణ (బీటీ ) బ్యాచ్ అని చెప్పుకోవటం తెలిసిందే. గులాబీ పార్టీలో ఈ రెండు వర్గాల మధ్య నిరంతరం ఒక నిశ్శబద్ద యుద్ధం సాగుతూనే ఉంటుంది.

బీటీ బ్యాచ్ మీద ఉద్యమ బ్యాచ్ తరచూ కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది. ఉద్యమం వేళలో తాము పడిన కష్టాలకు ప్రతిఫలంగా తెలంగాణ దక్కితే.. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరి కీలక పదవుల్ని అనుభవిస్తున్న వారిపై ఉద్యమ బ్యాచ్ లోలోన రగిలిపోతూ ఉంటారు. అయితే.. పార్టీ బలోపేతం కావాలన్నా.. తెలంగాణలో తిరుగులేని రాజకీయ పక్షంగా అవతరించాలన్నా బీటీ బ్యాచ్ అవసరాన్ని గుర్తించిన కేసీఆర్ వారిని అక్కున చేర్చుకోవటమే కాదు.. వారి మనసుల్ని దోచేలా పదవుల్ని ఇచ్చే విషయంలో వెనకడుగు వేయలేదు.

తాజాగా ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్య్రమాల్లో గులాబీ నేతలు పెద్దఎత్తున హాజరు కావటం ఒక ఎత్తు అయితే.. హాజరైన వారిలో అత్యధికులు బీటీ బ్యాచ్ కావటం ఆసక్తికరంగా మారింది. ఇంతకు ముందెప్పుడూ వినని ఒక కొత్త నినాదం వారి నోటి నుంచి వినిపించటం మరో విశేషంగా చెప్పాలి. ఇప్పటివరకు జై తెలంగాణ.. జై కేసీఆర్ అన్న నినాదం మాత్రమే వినిపించే స్థానే.. దానికి అదనంగా జై ఎన్టీఆర్ అంటూ నినదించిన వైనం సరికొత్తగా మారింది.

ఇంతకాలం లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఈ నినాదాల మర్మం ఏమిటన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాల్ని ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి మొదలు పెడితే ఉద్యమ వేళలో కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కానీ ఎన్టీఆర్ ఊసెత్తని గులాబీ నేతలు.. ఇప్పుడు అందుకు భిన్నంగా జై ఎన్టీఆర్ అన్న నినాదాన్ని నినదించటం వెనుక.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్న కమ్మ సామాజిక వర్గ ఓటర్ల మనసు దోచుకోవటానికి వీలుగానే ఇదంతా జరిగిందంటున్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ పార్టీ పరువు నిలిచిందంటే.. అందుకు కారణంగా సెటిలర్ల ఓట్లతో పాటు.. బలమైన సామాజిక వర్గంగా ఉన్న కమ్మ ఓటర్లు టీఆర్ఎస్ వైపునకు మొగ్గు చూపటమే అన్న వాదన ఉంది. దీనికి తోడు రాష్ట్రంలోని నిజామాబాద్.. ఖమ్మం.. నల్గొండ జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టును మరింత పెంచుకోవటానికి జై ఎన్టీఆర్ నినాదం సాయం చేస్తుందన్న మాట వినిపిస్తోంది.

ఈ కారణంతోనే ఎన్టీఆర్ శతజయంతిని నిర్వహించటంలో కొందరునేతలు కీలక పాత్రను పోషించారు. ఈ నేతల్లో అత్యధికులు ఒక సామాజిక వర్గానికి చెందిన వారు కావటం.. వారిలో ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారే కావటం గమనార్హం. మనసులో ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని ప్రదర్శించేందుకు కాలం కూడా కలిసి రావటంతో అస్సలు తగ్గకుండా.. ఎన్టీఆర్ శత జయంతిని ధూంధాంగా నిర్వహించటంతో పాటు గులాబీ పార్టీకి.. జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై ఎన్టీఆర్ అన్న కొత్త నినాదాన్ని తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు.