Begin typing your search above and press return to search.

అదేంది మంగ్లి అలాంటి తప్పు చేశావా?

By:  Tupaki Desk   |   21 July 2021 3:31 AM GMT
అదేంది మంగ్లి అలాంటి తప్పు చేశావా?
X
తెలంగాణ యాసకు.. పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చిన గాయనీగాయకుల్లో మంగ్లి ఒకరు. తన ఆటపాటతో అందరిని అలరించే ఆమె.. తాజాగా చేసిన ఒక పాట విషయంలో గతంలో ఎప్పుడు ఎదురుకాని సిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బోనాల పండుగ వేళలో.. ప్రతి ఏటా ఒక పాటను సిద్ధం చేసి రిలీజ్ చేసే ఆమె.. తాజా బోనాల సీజన్ సందర్భంగా ఒక పాటను విడుదల చేయటం తెలిసిందే. అయితే.. ఈ పాటలో ఉపయోగించిన పదాలు ఇప్పుడు కొత్త వివాదంగా మారి.. సంప్రదాయ తెలంగాణవాదులు మండిపడుతున్నారు.

ఇప్పుడీ వివాదం అంతకంతకూ రాజుకుంటోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకునే మంగ్లి.. తప్పు ఎలా చేసిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఈ పాటలో ఉపయోగించిన పదాలపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 11న మంగ్లీ అధికారిక యూ ట్యూబ్ చానల్ ద్వారా కొత్త పాటను రిలీజ్ చేశారు. ఇందులో అమ్మవారిని చుట్టంలా అభివర్ణించటం వివాదానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. పాట అన్నది భక్తిని పెంచేలా ఉండాలే కానీ.. అందుకు విరుద్ధంగా విమర్శలు చేయటానికి వీలు కల్పించేదిలా.. తప్పుడు అభిప్రాయాల్ని కలిగించేలా అస్సలు ఉండకూడదంటున్న విమర్శ నెటిజన్లు పెద్ద ఎత్తున చేస్తున్నారు.

తాజా పాట అమ్మవారిని మొక్కినట్లుగా కంటే కూడా తిడుతున్నట్లుగా ఉందన్నది ప్రధాన ఫిర్యాదుగా చెప్పాలి. వెంటనే పాటలోని పదాల్ని మార్చాలన్న అభిప్రాయం పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది. పేరు ప్రఖ్యాతుల కోసం హిందూ దేవతల్ని.. దేవుళ్లను విమర్శించటం ఫ్యాషన్ అయిపోయిందని.. మంగ్లీ కూడా ఇలానే చేసిందన్న ఆరోపణ ఉంది. ‘‘ఇప్పటివరకు హిందూ దేవతల మీద పడినోళ్లు.. ఇప్పుడు గ్రామ దేవతల మీదా మొదలు పెట్టారా?’’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ అంతలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పాటలో ఉన్న అభ్యంతరకర వ్యాఖ్యల్ని చూస్తే.. 'చెట్టు కింద కూసున్నవమ్మా.. సుట్టం లెక్క ఓ మైసమ్మా’ లాంటి పదాల మీద ఆగ్రహం వ్యక్తమవుతోంది. రామస్వామి లిరిక్స్ అందించగా.. రాకేష్ వెంకటాపురం సంగీతాన్ని అందించారు. ఓవైపు ఈ పాట యూ ట్యూబ్ లో విశేష ఆదరణ పొందుతున్న వేళ.. మరోవైపు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం. తాజాగా ఈ పాట మీద తమకున్న అభ్యంతరాలతో రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో బీజేపీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు.

బోనాల పాటలో అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొన్నారు. తక్షణమే ఈ పాటను సోషల్ మీడియా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. మంగ్లీపై కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. మరి.. ఇంత రచ్చ జరుగుతున్న వేళ.. మంగ్లి రియాక్షన్ ఏమిటో..?