పొలిటికల్ ఫ్లాష్ బ్యాక్ : బాలయ్య వైఎస్సార్ కి రుణపడ్డాడా....?

Sun Sep 25 2022 09:25:09 GMT+0530 (India Standard Time)

Did Balayya owe YSR

సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ఫ్లాష్  బ్యాక్స్ ఉంటాయి. అవి కూడా బిగ్ ట్విస్ట్ ఇవ్వాలనుకున్నపుడు అలా తన్నుకు వచ్చేస్తాయి. ఇక ఏపీలో అతి పెద్ద సూపర్ హిట్  పొలిటికల్ ఫ్లాష్ బ్యాక్ ఏది అంటే చంద్రబాబు ఎన్టీయార్ కి పొడిచిన  వెన్నుపోటు. పిల్లని ఇచ్చిన మామను అల్లుడు అయిన బాబు వెన్నుపోటు పొడిచారు అంటూ దశాబ్దాలు గడచినా దాన్ని అలాగే జనాలకు  గుర్తు చేస్తూ ప్రత్యర్ధులు పాత రీళ్ళను తిప్పేస్తూ ఉంటారు.ఇక బాబు గారి బావమరిది సినీ నటుడు బాలయ్యకు కూడా ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నాయని ప్రత్యర్ధులు అంటారు. వాటిని వారు సరైన టైం లో ముందుకు తెస్తారు. బాలయ్య ఏమైనా అంటే ఆయన నోటికి ప్లాస్టర్ వేయడానికి ఈ ఫ్లాష్ బ్యాక్ ని అలా తవ్వి తీస్తారు. ఇపుడు వైసీపీ మంత్రి జోగి రమేష్ అదే పని చేశారు.

బాలయ్య తన తండ్రి పేరుని హెల్త్ వర్శిటీ నుంచి తొలగించినందుకు మండిపడ్డారు. అదే ఊపులో వైసీపీ సర్కార్ మీద కూడా కామెంట్స్ చేశారు. అందులో  శునకాలు అని ఎవరిని ఉద్దేశించి ఆయన అన్నారో తెలియదు కానీ మంత్రి జోగి రమేష్ కి బాగా మండినట్లుంది. ప్రెస్ మీట్ పెట్టి మరీ బాలయ్యను బాగానే టార్గెట్ చేశారు.

బాలయ్యా నీకు ఎన్టీయార్ జన్మనిస్తే వైఎస్సార్ పునర్జన్మని ఇచ్చారు. ఒక్కసారి అలా వెనక్కి వెళ్ళి ఆలోచించుకో నీకే అర్ధమవుతుంది అంటూ హింట్ ఇచ్చి వదిలారు. అప్పట్లో అంటే  2004 టైం లో బాలయ్య ఇంట్లో జరిగిన ఒక కాల్పుల ఘటనకు సంబంధించి జోగి రమేష్ ఈ కామెంట్స్ చేశారన్న మాట. నాడు మరి తెర వెనక ఏమి జరిగిందో బాలయ్యకు ఏ విధంగా హెల్ప్ లభించిందో తెలియదు కానీ ఇపుడు దాన్ని కెలికి జోగి రమేష్ బాలయ్య నోరు మెదపకుండా చేయడానికి చూశారని అంటున్నారు.

అంతే కాదు జగన్ కి కూడా బాలయ్య రుణపడి ఉండాలంటూ మరో పంచ్ విసిరారు. విజయవాడకు ఎన్టీయార్ పేరు పెట్టినందుకు థాంక్స్ అయినా చెప్పలేని బాలయ్య ఇపుడు తగుదునమ్మా అని విమర్శలు చేయడానికి ముందుకు వస్తున్నారు అని గట్టిగానే జోగి రమేష్ తగులుకున్నారు. జిల్లా పెద్దదా వర్శిటీ పెద్దదా అంటూ బాలయ్యా  ఒక చర్చకు కూడా పెట్టి శాశ్వతమైన కీర్తిని తన తండ్రికి అందించిన జగన్ విషయంలో కనీసంగా అయినా థాంక్స్ అని చెప్పలేరా అంటూ బాలయ్య మీద ఫైర్  అయ్యారు.

తన తండ్రి పదవిని లాక్కుని ఆయనను మానసిక క్షోభకు గురి చేసిన చంద్రబాబు కొడుక్కు పిల్లను బాలయ్య ఎలా ఇస్తారని ఇది తండ్రికి చేసిన ద్రోహం కాదా అని ప్రశ్నించారు. ఇక బాబు కొడుకు లోకేష్ ని  కనకమా శునకమా ఏమనుకుని పిల్లను ఇచ్చావు అని కూడా రెట్టించారు. వెన్నుపోటు పడిచినపుడు అంతా కలసి నవ్వుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారని మరి నాడు అనిపించలేదా ఎన్టీయార్ తెలుగు వెలుగు అని అంటూ బాలయ్యను నిలదీశారు.

ఇక అసెంబ్లీలో వర్శిటీ పేరు మార్చుతూ బిల్లు పెడితే ఒక ఎమ్మెల్యేగా  ఎన్టీయార్ కొడుకుగా  మాట్లాడాల్సిన బాలయ్య ఎక్కడ ఉన్నారని కూడా ప్రశ్నించారు. సినిమా డైలాగులు రాజకీయాల్లో చెల్లవని చిత్తశుద్ధి లేని ఇలాంటి చర్యల వల్ల ఎన్టీయార్ మీద ప్రేమ ఉందని చెబితే ఎవరు నమ్ముతారని కూడా జోగి రమేష్ పేర్కొన్నారు.

చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ ని పలుకుతున్న బాలయ్య నందమూరి తెలుగుదేశం నారా దేశంగా మారిందన్న సంగతిని ముందు తెలుసుకుని బావ బాబుతో పోరాటానికి సిద్ధమైతే ఎన్టీయార్ ఆత్మ శాంతిస్తునని కూడా జోగి రమేష్ సలహా ఇచ్చారు. మొత్తానికి మంత్రి రమేష్ చెప్పేది ఏంటి అంటే బాలయ్య వైఎస్సార్ కి పూర్తిగా రుణపడి ఉండాలనే. మరి దీనికి నందమూరి నటసింహం ఏమంటుందో.