Begin typing your search above and press return to search.

రిటైర్మెంట్ పై ధోనీ కీలక వ్యాఖ్యలు.. తాజా వ్యాఖ్యల అర్థం ఇదేనా?

By:  Tupaki Desk   |   30 May 2023 11:00 AM GMT
రిటైర్మెంట్ పై ధోనీ కీలక వ్యాఖ్యలు.. తాజా వ్యాఖ్యల అర్థం ఇదేనా?
X
ఐపీఎల్ ఫైనల్ పోరు సందర్భంగా రెండు అంశాలు క్రికెట్ అభిమానుల మధ్య ఆసక్తికర చర్చను రేపాయి. అందులో ఒకటి.. ఐపీఎల్ విజేత ఎవరు? రెండోది.. ఐపీల్ కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తారా? లేదా? అని. ఐపీఎల్ విజేత ఎవరన్న విషయం పై క్లారిటీ వచ్చేయటంతో పాటు.. చెన్నై జట్టు అభిమానులంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక.. క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంటగా చూస్తున్న రిటైర్మెంట్ అంశం పై ధోనీ రియాక్టు అయ్యారు. మ్యాచ్ ముగిసి.. విజేతగా నిలిచిన ఆనంద వేళలో ప్రముఖ వ్యాఖ్యత హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

నా రిటైర్మెంట్ పై జవాబు కోసం మీరు చూస్తున్నారా? దీని పై ప్రకటన చేయటానికి ఇది సరైన సమయమే కానీ ఈ ఏడాది నేనెక్కడికి వెళ్లినా ప్రేక్షకుల నుంచి భారీగా ప్రేమాభిమానాల్ని సొంతం చేసుకున్నానని చెప్పారు. "ఇలాంటి వేళలో అందరికి థ్యాంక్స్ అని చెప్పటం చాలా సులువు. అయితే.. నా వరకు కష్టమైన అంశం ఏమంటే.. మరో తొమ్మిది నెలలు శ్రమించి కనీసం వచ్చే సీజన్ ఆడాలి. అయితే.. ఇదంతా నా శరీరం మీద ఆధారపడి ఉంటుంది. దీని పై నిర్ణయం తీసుకోవటానికి మరో ఆరేడు నెలలు సమయం ఉంది. టైటిల్ ను మా జట్టు నాకు గిఫ్టుగా ఇచ్చింది. నా పట్ల వారు చూపిన ప్రేమాభిమానాలకు నేను చేయాల్సిన బాధ్యతలు ఇంకా ఉన్నాయనిపిస్తోంది" అని పేర్కొన్నారు.

తన పై అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాల గురించి ప్రస్తావిస్తూ ధోనీ ఎమోషనల్ అయ్యారు. "నా కెరీర్ చివరి దశ కావటంతో కాస్త ఎమోషన్ కు గురయ్యా. తొలి మ్యాచ్ కోసం బరిలో కి దిగినప్పుడు అభిమానులు నా పేరును పలుకుతుంటే భావోద్వేగానికి గురయ్యా. డగౌట్ లో ఉన్న నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే.. డిసైడ్ అయ్యా.. ఈ సీజన్ ను ఎంజాయ్ చేస్తూ ఆడాలని. అలాగే చెన్నై జట్టు పరిస్థితి కూడా ఇదే. తిరిగి వచ్చి మళ్లీ ఆడేందుకు చేయగలిగినందంతా చేస్తా. నన్ను.. నా ఆట ను చూసేందుకు వచ్చిన అభిమానులకు రుణపడి ఉంటా" అని వ్యాఖ్యానించారు.

తన వ్యక్తిత్వాన్ని తానెప్పటికి మార్చుకోలేనని.. తనకు ప్రతి ట్రోఫీ ప్రత్యేకమేనని చెప్పారు. ప్రతి మ్యాచ్ లోనూ ఉత్కంఠ ఉండటం ఐపీఎల్ ప్రత్యేకతని.. దాని కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. గుజరాత్ తో జరిగిన ఫైనల్ పోరు లో తమ బౌలింగ్ విభాగం కాస్త గాడి తప్పిందని.. అయితే.. బ్యాటింగ్ లో మాత్రం ఒత్తిడిని తట్టుకొని నిలదొక్కుకుందన్నారు. "నేను నిరాశ పరిచాను (పరుగులు ఏమీ చేయకుండానే అవుట్ అయ్యారు) ప్రతి ఒక్కరూ రాణించేందుకు ప్రయత్నిస్తారు. అజింక్య రహానె సహా కొందరికి ఎంతో అనుభవం ఉంది. అందరికంటే ఎక్కువగా అంబటి రాయుడు మైదానంలో వందశాతం శ్రమించే ప్లేయర్. అతనుంటే మాత్రం నేను ఫెయిర్ ప్లే ఆవార్డు ను మాత్రం గెలవలేను" అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు.

అంబటి రాయుడు ఒక అద్భుత మైన క్రికెటర్ అని.. చాలాకాలం నుంచి అతడితో కలిసి ఆడిన అనుభవం ఉందన్నారు. టీమిండియా జట్టు నుంచి అతడు తనకు తెలుసని.. స్పిన్.. పేస్ ను అద్భుతంగా ఆడతాడన్న ధోనీ.. తన చివరి గేమ్ లోనూ ఉత్తమ ప్రదర్శన చేశారన్నారు (వరుస మూడు బంతుల్లో 6, 4,6 కొట్టటం తెలిసిందే). "నాలానే అంబటి రాయుడు ఫోన్ ఎక్కువగా వాడడు. అద్భుతంగా కెరీర్ ముగించిన రాయుడు లైఫ్ లో తర్వాతి దశను సంతోషంగా గడపాలని కోరుకుంటున్నా" అని పేర్కొన్నారు. ధోనీ మాటల్ని చూస్తే.. తన రిటైర్మెంట్ మీద నిర్ణయాన్ని ఇప్పటికిప్పడు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నట్లు అర్థమవుతుంది. చూస్తుంటే.. వచ్చే ఐపీఎల్ టోర్నీ కి కూడా ఆయన చైన్నై కు సారథ్యం వహించే అవకాశాలే ఎక్కువని చెప్పక తప్పదు.