అవినాష్.. అప్పుడలా ఇప్పుడిలా!

Thu Nov 14 2019 23:00:01 GMT+0530 (IST)

దేవినేని అవినాష్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని కొన్నాళ్లుగా ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. ఎన్నికలు అయిపోయిన కొన్ని నాళ్లకే ఆయన విషయంలో ఆ వార్తలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీని వీడి ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి.అయితే ఆ కథనాలను అప్పుడు ఆయన ఖండించారు. ఏదో మాటమాత్రంగా ఖండించి ఉంటే అదో లెక్క. అయితే అవినాష్ మరో పని కూడా చేశారు. అదేమంటే.. అప్పుడు ఆ వార్తలను రాసిన మీడియా వర్గాలకు ఆయన నోటీసులు పంపించారు!

తను పార్టీ మారబోతున్నట్టుగా వార్తలు రాశారంటూ వివిధ మీడియా వర్గాలకు ఆయన లీగల్ నోటీసులు పంపించారు. ఒక రాజకీయ నేత విషయంలో అలాంటి ఊహాగానాలు మామూలే. నిప్పులేనిదే పొగరాదు.

అయితే అవినాష్ మాత్రం ఏకంగా నోటీసులు పంపించి హడావుడి చేశారు. తీరా ఇప్పుడు ఆయన పార్టీ మారారు. మీడియా ఊహాగానాలే నిజం అయ్యాయి. మరి అప్పుడు తన గురించి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారంటూ అవినాష్ పంపించిన నోటీసులను ఏమనాలో!