సచివాలయం కూల్చివేతపై తాజాగా హైకోర్టు ఏం చెప్పింది?

Mon Jul 13 2020 16:00:15 GMT+0530 (IST)

Demolition of old Telangana Secretariat

తెలంగాణ సచివాలయ భవనాల్ని కూల్చివేతకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం.. అందుకు కోర్టు అభ్యంతరాలు లేకపోవటంతో.. ఇటీవల అర్థరాత్రి వేళ.. హడావుడిగా కూల్చేస్తున్న వైనం తెలిసిందే. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో పాటు.. తాజాగా తమకున్న అభ్యంతరాలపై ఇటీవల మరోసారి హైకోర్టును ఆశ్రయించటం జరిగింది. దీంతో స్పందించిన హైకోర్టు సచివాలయ భవనాల కూల్చివేతను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.తదుపరి విచారణ తర్వాత తాము ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఈ రోజు (సోమవారం) కూల్చివేత అంశంపై విచారణను చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం నిలిపిన కూల్చివేత ప్రక్రియను ఈ నెల 15 వరకు ఆపాలని పేర్కొంది. అంతేకాదు.. భవనాల కూల్చివేత అనుమతుల్ని హైకోర్టుకు ప్రభుత్వం కౌంటర్ రూపంలో సమర్పించింది.

ఇదిలా ఉంటే.. కూల్చివేతకు కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం కోరింది. దీనికి సంబంధించిన ప్రభుత్వం తరఫు న్యాయవాది.. ఆ నివేదికను ఈ సాయంత్రానికి కోర్టుకు సమర్పిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ కు రిప్లై కౌంటర్ దాఖలు చేస్తామని.. పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కోర్టు విచారణను ఈ నెల 15 వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పటివరకూ కూల్చివేతల్ని నిలిపివేయాలని కోర్టు పేర్కొంది.