ఢిల్లీ టూ భీమవరం : రఘురామకు వరం ఇచ్చేదెవరు...?

Mon Jun 27 2022 19:00:01 GMT+0530 (India Standard Time)

Delhi to Bhimavaram: MP RaghuRam

ఆయన వైసీపీకి చెందిన ఎంపీ. ఆయన ప్రధాని ప్రోగ్రాం లో పాలుపంచుకోవాలనుకుంటున్నారు. మామూలుగా అయితే ఆయనకు అది నల్లేరు మీద నడక. ఏపీలో ఆయన పార్టీ సర్కారే కొలువు తీరి ఉంది.  కానీ ఆయన ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ అధినేత  జగన్ తోనే  పేచీ పెట్టుకున్నారు. జగన్ మీద బస్తీ మే సవాల్ అన్నారు. దాంతో గత రెండున్నరేళ్ళుగా జగన్ వర్సెస్ రఘురామగా రాజకీయ రచ్చ సాగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో రఘురామ దాదాపుగా మూడేళ్ళ తరువాత తన సొంత నియోజకవర్గంలో కాలు పెట్టాలనుకుంటున్నారు.



అది కూడా ప్రధాని మోడీతో కలసి. భీమవరం లో జూలై 4న జరిగే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను ప్రధాని ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ ఉత్సవాలకు లోకల్ ఎంపీగా రఘురామ కూడా హాజరు కావాల్సి ఉంది. పైగా ఆయనకు బీజేపీతో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి.

అయితే రఘురామ భీమవరం రావాలీ అంటే ఆయన భద్రత విషయంలో ఏపీ సర్కార్ గ్యారంటీ ఇవ్వాలి. ఇప్పటికే ఒకసారి ఆయన్ని హైదరాబాద్ నుంచి తెచ్చి ఒక రోజు రాత్రి అంతా పోలీస్ స్టేషన్ లో ఉంచి ఇబ్బంది పెట్టారు అని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆయన ఏపీకి ఎపుడు వద్దామనుకున్నా అరెస్ట్ చేస్తారు అన్న భయం ఉంది. ఆయన మీద ఏపీ సీఐడీ అనేక కేసులను నమోదు చేసి ఉంది.

దాంతో ఇలా రఘురామ వస్తే ఆలా అరెస్ట్ కు ఏపీ సీఐడీ పోలీసులు రెడీగా ఉంటారు. దాంతో రాజు గారికి ఇపుడు ఏపీ సర్కార్ నుంచి వరం కావాలి. ప్రత్యేకించి జగన్ నుంచి గ్యారంటీ కావాలి. అసలే రఘురామ అంటే మండిపడుతున్న జగన్ ఆ వరం ఇస్తారు అనుకుంటే పొరపాటే. రఘురామ ఇలా ల్యాండ్ అయితే  అలా అరెస్ట్ చేయించాలని వైసీపీ సర్కార్ పట్టుదలగా ఉంది.

మరో వైపు చూస్తే ప్రధాని టూర్ కోసం రఘురామ కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. తాను లోకల్ ఎంపీగా వెళ్ళాల్సి ఉందని ఆయన అంటున్నారు. ఇక కేంద్రం అయితే రఘురామ విషయంలో భద్రత పరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ సర్కార్ నే కోరాల్సి ఉంది. కేంద్రంలో బీజేపీతో దోస్తీ చేస్తున్న జగన్ ని ఆయన భద్ద వ్యతిరేక ఎంపీగా ఉన్న రఘురామ విషయంలో కేంద్రం ఎలా కోరుతుంది అన్నది ఒక ప్రశ్నగా ఉంది.

అదే టైమ్ లో ప్రధాని ప్రొగ్రాం అంటే కచ్చితంగా ప్రోటోకాల్ పాటిస్తారు. అలా చూస్తే లోకల్ ఎంపీగా రఘురామ ఉండాల్సిందే. దాంతో కేంద్రం ఏమైనా జగన్ సర్కార్ కి చెప్పి ఒప్పించి భద్రతను తీసుకుని మరీ రాజు గారిని భీమవరం వచ్చేలా చూస్తుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా రాజు గారి భీమవరం టూర్ మాత్రం ఆసక్తిని రేపుతోంది. ఈ విషయంలో జగన్ వరం ఇస్తారా కేంద్రం ఇస్తుందా అన్నది కూడా చూడాలి.