Begin typing your search above and press return to search.

మాజీలకు వారమే టైం... ఖాళీ చేయకుంటే నీళ్లు, కరెంట్ కట్టే

By:  Tupaki Desk   |   19 Aug 2019 5:58 PM GMT
మాజీలకు వారమే టైం... ఖాళీ చేయకుంటే నీళ్లు, కరెంట్ కట్టే
X
దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ఖరీదైన ప్రాంతం లుటియెన్స్ బంగ్లాల్లో అడుగు పెడితే ఖాళీ చేయాలంటే అస్సలు మనసే ఒప్పదు. ఎందుకంటే పార్లమెంటుకు అత్యంత సమీపంలో హై సెక్యూరిటీ జోన్ గా ఉన్న ఈ ప్రాంతంలో నివాసమంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అందుకేనేమో... ఈ ప్రాంతంలోని ప్రభుత్వ బంగ్లాల్లో అడుగుపెట్టిన ఎంపీలు తమ పదవీకాలం ముగిసినా... అక్కడి నుంచి కదిలేందుకు ఇష్టపడటం లేదు. ఓ సారి ఎంపీగా గెలిచాక... లుటియెన్స్ బంగ్లాల్లో కాలు పెట్టే ఎంపీలు అలా గెలుస్తూ పోతుంటే ఫరవా లేదు గానీ... ఓడితే మాజీలు అయిపోతారు కదా. మరి మాజీలకు అక్కడ బంగ్లాలు ఇవ్వరు కదా. అయితే ఎంపీలుగా వాటిలో అడుగుపెట్టి మాజీలుగా మారితే... ఖాళీ చేయాల్సిందే కదా. అయితే అందుకు ససేమిరా అంటున్నారు మన మాజీ ఎంపీలు.

వీరు ఖాళీ చేయకుంటే కొత్త ఎంపీలకు బంగ్లాలు కరువే కదా. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు ఢిల్లీలో నెలకొంది. ఎంతకూ దారికి రాని మాజీ ఎంపీలను లుటియెన్స్ బంగ్లాల నుంచి ఖాళీ చేయించేందుకు నరేంద్ర మోదీ సర్కారు ఇప్పుడు తనదైన శైలి వార్నింగ్ ఇచ్చేసింది. ఈ వార్నింగ్ అలాంటిలాంటిది కాదు. కేవలం వారం రోజుల పాటు గడువిచ్చేసిన కేంద్రం... ఆ వారంలో కూడా తొలి నాలుగు రోజులు ముగిసిన తర్వాత కూడా మాజీ ఎంపీలు బంగ్లాలను ఖాళీ చేయకుంటే... ఆ బంగ్లాలకు వాటర్ తో పాటు కరెంట్ కూడా నిలిపేస్తుందట. మరి ఎంత సౌకర్యవంతంగా ఉన్న బంగ్లాలైనా... నీళ్లు, వెలుతురు లేకుండా ఉండలేరు కదా.

ఈ లెక్కన ప్రస్తుతం లుటియెన్స్ ప్రాంతంలో బంగ్లాలు ఖాళీ చేయకుండా ఉన్న దాదాపు 200 మంది ఈ వారాంతానికి బంగ్లాలను ఖాళీ చేసి పోక తప్పదన్న మాట. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు ఢిల్లీలో నివాస ఏర్పాట్లకు ఇబ్బంది ఉందంటూ సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేయడం, ఆ వెంటనే బంగ్లాలు ఖాళీ చేయకుండా దిలాసాగా కూర్చున్న మాజీ ఎంపీలకు వార్నింగ్ ల మాదిరి నోటీసులు జారీ చేయడం క్షణాల్లో జరిగిపోయింది. సో... ఈ వారాంతానికి మాజీలంతా లెటియెన్స్ బంగ్లాలను ఖాళీ చేసి సొంతూళ్లకు పరుగు పెట్టడం ఖాయమేనన్న మాట.