Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కు ఉద్యమంలోకి ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ ఫైర్ బ్రాండ్.. ఏం కానుంది?

By:  Tupaki Desk   |   19 April 2021 1:30 AM GMT
విశాఖ ఉక్కు ఉద్యమంలోకి ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ ఫైర్ బ్రాండ్.. ఏం కానుంది?
X
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ అప్పుడెప్పుడో తెలుగు ప్రజల్ని ఒక ఊపు ఊపేసిన ఉద్యమాన్ని గుర్తు చేసుకోవటం.. గొప్పలు చెప్పుకోవటమే తప్పించి.. చేతల్లో చూపించలేని పరిస్థితి. మా తాతలు నేతలు తాగారన్న సామెత తెలుగోళ్లకు ఎంచక్కా సరిపోతుందేమో. కేంద్రంలోని మోడీ సర్కారు విశాఖ ఉక్కు పరిశ్రమను టార్గెట్ చేస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నా.. దాని పరిరక్షణ కోసం ఏపీ నేతలు చేస్తున్నదేమీ లేదని చెప్పాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. అవసరమైతే విశాఖకు వెళ్లి ఉద్యమంలో పాల్గొంటామన్న మాట వచ్చింది. అలాంటి మాటలు ఏపీ నేతల నోటినుంచి పెద్దగా వచ్చింది లేదు.

ఈ ఎపిసోడ్ లో ఏపీ బీజేపీ నేతల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. జనసేన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీతోనూ.. కేంద్రంలోని మోడీతోనూ పెట్టుకోవటానికి ఏమాత్రం ఇష్టపడని విపక్ష టీడీపీ ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తుందే తప్పించి.. దూకుడుగా వ్యవహరించటం లేదు. ఇక.. ఏపీ అధికారపక్షం తన వంతుగా చేయాల్సిన పని చేస్తుంది.

ఇలాంటివేళ.. నేతల్ని నమ్ముకోవటం కాదు.. తమకు చేతనైనట్లుగా ఉద్యమాన్ని బలోపేతం చేయాలన్నట్లుగా ఉక్కు పరిరక్షణ కమిటీ వ్యవహరిస్తోంది. తాజాగా భారీ ర్యాలీని నిర్వహించారు. కేంద్రం తీరును నిరసిస్తూ పార్క్ హోటల్ నుంచి ఆర్కే బీచ్ వరకు ర్యాలీని చేపట్టారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పినా.. పెద్దగా పట్టించుకోకుండా కాలి బాటన రోడ్ల మీదకు వచ్చారు.

ఈ నిరసన ర్యాలీలో చెప్పుకోదగ్గ అంశం ఏమంటే.. ఉక్కు కర్మాగారం కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా.. ఢిల్లీలో రైతు చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రాకేశ్ టికాయత్ హాజరయ్యారు. ఆయన రావటంతో.. ఇంతకాలం మీడియాను ఆకర్షించని ఉక్కు ఉద్యమం ఒక్కసారి మీడియాలో దర్శనమిస్తోంది. కరోనా సెకండ్ వేవ్.. తిరుపతి ఉప ఎన్నిక.. ఇలా హాట్ ఇష్యూస్ నేపథ్యంలో విశాఖ ఉక్కు ఉద్యమం పక్కదారి పట్టిన వేళ.. ఢిల్లీ ఫైర్ బ్రాండ్ ఎంట్రీ ఉద్యమాన్ని మరెక్కడి వరకు తీసుకెళుతుందో చూడాలి.