వీలైనంత త్వరలో చార్జిషీట్.. వివేకా హత్య కేసులో సీబీఐ సంచలన నిర్ణయం.. కోర్టుకు వెల్లడి

Fri Mar 31 2023 20:17:53 GMT+0530 (India Standard Time)

Decision of the CBI in Viveka's murder case.. revealed to the court

ఏపీ రాజకీయాలను పెనుకుదుపునకు గురి చేసిన సీఎం జగన్ చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వీలైనంత త్వరలోనే చార్జిషీటును దాఖలు చేస్తామని సీబీఐ అధికారులు హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న సీబీఐ కోర్టు కు వెల్లడించారు. తాజాగా శుక్రవారం జరిగిన విచారణలో సీబీఐ ఈ మేరకు కోర్టుకు వివరించింది. ఈ వివరాలు నమోదు చేసుకున్న కోర్టు  వచ్చే నెల 28వ తేదీకి వాయిదా వేసింది.నలుగురు నిందితుల హాజరు

వివేకా కేసులో ఉన్న నలుగురు నిందితులను సీబీఐ న్యాయస్థానంలో హాజరు పరిచారు.  చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సునీల్ యాదవ్ ఉమాశంకర్ దేవిరెడ్డి శివశంకర్ను పోలీసులు నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు తీసుకొచ్చారు.

బెయిల్ పై ఉన్న ఎర్ర గంగిరెడ్డి కూడా కోర్టుకు వచ్చాడు. దస్తగిరి మాత్రం కోర్టుకు హాజరు కాలేదు. అనివార్య కారణాల వల్ల రాలేకపోయాడని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపాడు. ఈ మేరకు గైర్హాజరు పిటిషన్ వేశాడు.

మార్పులు చేశాం..

వివేకా హత్య కేసులో ఏర్పాటైన సిట్లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్పులు చేసినట్లు దర్యాప్తు అధికారిని మార్చినట్లు సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దర్యాప్తును వేగవంతం చేశారని... వీలైనంత త్వరలో చార్జిషీట్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ.. సీబీఐ న్యాయవాదికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.  

సుప్రీం ఆదేశాలతోనే స్పీడ్!!

వివేకానందరెడ్డి కేసు విషయంలో ఇటీవల సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసును ఎన్నాళ్లు విచారిస్తారని ప్రశ్నించింది. క్రమినల్ అభియోగాలను ఏప్రిల్ 30 లోగా తేల్చాలని ఆదేశించింది. హత్య కేసులో ఏ 5 ముద్దాయి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ కోరుతూ అతడి భార్య తులశమ్మ వేసిన పిటిషన్ను విచారించిన విషయం తెలిసిందే. అదేసమయంలో దర్యాప్తు అధికారి రాం సింగ్ను మార్చాలని సిట్ ఏర్పాటు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. దీంతో సీబీఐ కొత్త సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.