Begin typing your search above and press return to search.

మోడీకి మద్దెల దరువేనా ?

By:  Tupaki Desk   |   5 Dec 2021 5:30 AM GMT
మోడీకి మద్దెల దరువేనా ?
X
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రస్తుతం రోజులు అంత బాగున్నట్లు లేవు. ఒకవైపు ఈ మధ్యనే వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. మరోవైపు తొందరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కష్టమనే సంకేతాలు కనబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముందు జాగ్రత్తగా నూతన వ్యవసాయ చట్టాలను మోడి రద్దు చేశారు. డిమాండ్ల పరిష్కారం కోసం పార్లమెంట్ బయట రైతు సంఘాలు, పార్లమెంటు లోపల ప్రతిపక్ష ఎంపీలు మోడీని రెండువైపులా వాయించేస్తున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేస్తే రైతు సంఘాలు శాంతిస్ధాయని అందరూ అనుకున్నారు. అయితే క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మాత్రం వేరు.

తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించేంత వరకు తమ ఉద్యమం ఆగదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) కీలక నేత రాజేష్ తికాయత్ ప్రధాన మంత్రికి తేల్చి చెప్పేశారు. ఎందుకంటే పరిష్కరించాల్సిన రైతు సమస్యలు ఇంకా చాలానే ఉన్నాయనేది తికాయత్ వాదన. కనీస మద్దతు ధరకు చట్టం చేయాలని, ఉద్యమ కాలంలో రైతులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని, విద్యుత్ సంస్కరణల బిల్లును ఉపసంహరించుకోవాలని, రైతులపైకి వాహనాన్ని నడిపించి నలుగురు రైతుల మరణానికి కారకుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలనే డిమాండ్లు ఇంకా మిగిలే ఉన్నాయి.

నిజానికి రైతు సంఘాలు చేస్తున్న డిమాండ్లలో కొన్నింటిని పరిష్కరించటం ఇప్పటికిప్పుడు అయ్యేపని కాదు. రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవటం కేంద్రం చేతిలో లేదు. కోర్టు ద్వారా మాత్రమే కేసుల ఉపసంహరణ సాధ్యమవుతుంది. ఇక విద్యుత్ సంస్కరణల బిల్లు, కనీస మద్దతు ధరల చట్టం చేయటం కేంద్రం చేతిలోని పనే. కానీ రైతులు డిమాండ్ చేశారు కదాని అన్నీ చేసేస్తే మళ్ళీ మళ్ళీ ఏదో డిమాండ్లతో ఉద్యమం మొదలుపెట్టే అవకాశాలున్నాయి.

అందుకనే మోడి ప్రభుత్వం విషయాన్ని వీలైనంతగా లాగుతోంది. ఇదే సమయంలో పార్లమెంటులో ప్రతిపక్షాల ఎంపీలు దాదాపు ఇవే డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వాన్ని వాయించేస్తున్నారు. ప్రతిపక్షాల పోరుపడలేక 12 మంది రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేసినా ఎంపీలు గోల చేస్తునే ఉన్నారు. ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి ఇలాంటి దుర్బర పరిస్ధితిని ఎదుర్కోవటం మోడికి ఇదే మొదటిసారి.

మామూలుగా మోడి పార్లమెంటుకు హాజరైనా ప్రతిపక్షాలడిగే ఏ ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఎక్కువ మాట్లాడితే అసలు పార్లమెంటుకే హాజరుకారు. దాదాపు నెల రోజుల బడ్జెట్ సెషన్లో పార్లమెంటుకు హాజరైనా నోరువిప్పని ఏకైక ప్రధానమంత్రి మోడీ మాత్రమే. ఎందుకంటే ప్రతిపక్షాల ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పలేరు. అందుకనే ఒకవైపు పార్లమెంటులో ఎంపీలు, పార్లమెంటు బయట రైతు సంఘాల దెబ్బకు మోడి పరిస్థితి మద్దెల్లాగ అయిపోయింది. ఈ వాయింపుడు ఎంతకాలమో అర్థం కావటంలేదు.