Begin typing your search above and press return to search.

చైనాకు మన నేతల డేటా... అలీబాబానే దోషి

By:  Tupaki Desk   |   19 Sep 2020 5:31 PM GMT
చైనాకు మన నేతల డేటా... అలీబాబానే దోషి
X
మన దేశానికి చెందిన రాష్ట్రపతి, ప్రధాని, మంత్రులు, పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, పలు కీలక పార్టీలకు చెందిన నేతలకు చెందిన కీలక సమాచారం శత్రు దేశం చైనా చేతికి చిక్కిందన్న వార్తలు నిజంగానే కలకలం రేపుతున్నాయి. మన దేశంపైకి ఎప్పుడెప్పుడు దండెత్తుదామా అన్నట్లుగా చూస్తున్న చైనా... అందులో భాగంగానే మన దేశానికి చెందిన కీలక నేతల సమాచారాన్ని తన గుప్పిట్లోకి తీసుకుందన్న వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో చైనాకు చేదోడువాదోడుగా నిలవడమే కాకుండా... మన నేతల కీలక సమాచారాన్ని చైనాకు చేరవేయడంలో కీలకంగా వ్యవహరించింది మరెవరో కాదట.. చైనాకు చెందిన ప్రముఖ ఆన్ లైన్ పోర్టల్ అలీబాబానేనట.

చైనాకు మన నేతల డేటాను చేరవేసే బాధ్యతను పూర్తిగా అలీబాబానే భుజానికెత్తుకుని మరీ పని పూర్తి కానిచ్చేసిందన్న వార్తలు ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ పనిని అలీబాబా ఎలా పూర్తి చేసిందన్న విషయంలోకి వెళితే... మనదేశంలోని సంస్ధలు విదేశాల్లో వ్యాపార విస్తరణ చేసుకోవాలంటే మంచి ప్లాట్ ఫారం అవసరం. అందుకనే ఆలీబాబా అందిస్తున్న టెక్నాలజీ గ్రూపు సర్వర్లను అవి ఉపయోగించుకుంటున్నాయి. ముందుగా ఈ సర్వర్లలో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. మొదటిసారి నమోదు చేసుకునేటపుడు అంతా ఉచితం అనే పద్దతినే ఆలీబాబా కూడా వినియోగదారులను ఆకర్షిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.

ఆ తర్వాత సేవలు నిరాఘాటంగా సాగేందుకు మరిన్ని వివరాలను అప్ డేట్ చేయమని అలీబాబా సర్వర్లు ఆదేశిస్తున్నాయి. దాంతో వాళ్ళడిగిన డేటా మొత్తాన్ని వినియోగదారులు అందిస్తారు. ఇలాంటి 72 సర్వర్ల ద్వారా దేశంలోని ప్రముఖుల డేటా మొత్తం చైనాకు అలీబాబా చేరిందని నిఘా వర్గాలు ఓ నివేదికను కేంద్రానికి అందించాయి. తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారంతో దేశవ్యాప్తంగా సంచలనం మొదలైంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు, శాస్త్రజ్ఞులు, సెలబ్రిటీలు తదితరుల డేటా మొత్తం ఇపుడు చైనా గుప్పిట్లో ఉందనే వార్త నిజంగా ఆందోళనకరమనే చెప్పాలి.