సెకండ్ వేవ్ వేళ.. ఈటెల ధీమా లాజిక్కు ఏందో?

Sat Nov 21 2020 11:30:37 GMT+0530 (IST)

Dangerous Disease In Telangana

మన దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న వేళ.. యూరప్ దేశాల్లో కేసులు తగ్గుముఖం పట్టటం.. జన జీవన స్రవంతి సాధారణం కావటం.. ఎప్పటిలానే తమ కార్యకలాపాల్ని నిర్వర్తించుకోవటం తెలిసిందే. కరోనా తగ్గుదల అన్నది తాత్కాలికమేనని.. కాస్త తగ్గటం అన్నది.. మరోసారి విరుచుకుపడటం కోసమేనన్న సత్యాన్ని చాలా దేశాల్ని సీరియస్ గా తీసుకోలేదు. ఆ మాటకు వస్తే.. వూహాన్ మహానగరంలో కరోనాతో గజగజ వణుకుతున్న వేళ.. ప్రపంచ దేశాలన్ని కరోనాను అంత సీరియస్ గా తీసుకోలేదు. దీనికి ఎంత భారీగా మూల్యంగా చెల్లించాల్సి వచ్చిందో తెలిసిందే.వాస్తవానికి ట్రంప్.. వూహాన్ లో వైరస్ తీవ్రత తెలిసినంతనే చైనాతో విమాన రాకపోకలపై పరిమితులు విధించి.. చైనా నుంచి ట్రావెల్ అయ్యే విదేశీయుల మీద బ్యాన్ విధించి.. దేశంలోకి రానివ్వకుంటే ఈ రోజున ప్రపంచం పరిస్థితి మరోలా ఉండేదేమో? ఎందుకంటే.. అగ్రరాజ్యాధినేత హోదాలో కరోనా మీద కఠిన చర్యలకు తెర తీస్తే.. చాలా దేశాలు అమెరికా బాటను అనుసరించేవన్న మాట ఉంది. అదే జరిగి ఉంటే.. ఈ రోజున అమెరికాలో చోటు చేసుకున్న భారీ మరణాలు ఇంత స్థాయిలో జరిగి ఉండేవి కాదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తుంటారు.

ఇప్పుడు సెకండ్ వేవ్ అమెరికాతో పాటు యూరప్ దేశాల్ని వణికిస్తోంది. మన దేశానికి వస్తే.. సెకండ్.. థర్డ్ వేవ్ అంటూ ఢిల్లీ రాష్ట్రంతో పాటు కేరళను కూడా చేర్చారు. ప్రపంచంలోని పలు దేశాల్లో నడుస్తున్న కరోనా ట్రెండ్ తో పోలిస్తే.. భారత్ లో పరిస్థితి ఇప్పుడు మెరుగ్గా ఉందని చెప్పాలి. మరి.. ముఖ్యంగా తెలుగు  రాష్ట్రాల్లో ప్రస్తుతం కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. ఏపీతో పోలిస్తే..తెలంగాణలో కేసుల నమోదు మరింత తగ్గింది. గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రోజు 200 కంటే తక్కువ.. అప్పుడప్పుడు 140 కంటే తక్కువ కేసులు నమోదువుతున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ మీద భారీ ప్రచారంతో పాటు..భయాందోళనలు వినిపిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తెలంగాణ రాష్ట్రం మీద పెద్దగా ఉండదని తేల్చారు. అయితే.. తాను చెప్పింది వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పారు కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడితే.. దాన్ని ఎదుర్కోవటానికి.. ఎలాంటి పరిస్థితిని అయినా హ్యాండిల్ చేసే సామర్థ్యం ఉందంటున్నారు. నిజానికి తెలంగాణ సర్కారు సత్తా ఏమిటన్నది కరోనా ఫస్ట్ ఫేజ్ లోనే అందరికి అర్థమైంది. అలాంటిది సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న వేళలో.. మరీ ధీమా అవసరమా? అన్నది సందేహమే.

కరోనా లాంటి ఖతర్నాక్ వైరస్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం మంచిది కాదన్నమాట వినిపిస్తోంది. అనవసరమైన ధీమాతో  తిప్పలు తప్పవన్న విషయాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుందంటున్నారు. ఇంతకీ.. ఈటెల సాబ్ అప్రమత్తంగానే ఉన్నారంటారా?