Begin typing your search above and press return to search.

సీన్ మారింది.. తెలంగాణలో బెడ్లు చాలా ఉన్నాయట

By:  Tupaki Desk   |   11 July 2020 8:50 AM GMT
సీన్ మారింది.. తెలంగాణలో బెడ్లు చాలా ఉన్నాయట
X
రోజురోజుకీ పెరుగుతున్న కేసులు. అది కూడా పదిహేను వందలు.. పద్దెనిమిది వందలు.. ఇలా రాకెట్ వేగంతో దూసుకెళ్లిపోతున్న పాజిటివ్ ల కారణంగా.. ఆసుపత్రుల్లో బెడ్ల కొరత భారీగా ఉన్నట్లుగా వార్తా కథనాలు వస్తున్నాయి. చాలామంది రోగులు.. వారి బంధువులు బెడ్ల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నట్లుగా వార్తలు వస్తున్న వేళ.. రాష్ట్రంలో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయన్న విషయాన్ని తెలియజేస్తూ.. తెలంగాణ బులిటెన్ లో పేర్కొన్నారు.

రాష్ట్రం మొత్తం ఉన్న బెడ్ల సామర్థ్యంలో 90 శాతానికి పైగా ఖాళీలు ఉన్నట్లుగా చెబుతున్నారు. గతంలో ఎన్ని బెడ్లు ఉన్నాయి? ఎన్ని ఆక్సిజన్ బెడ్లు.. మరెన్ని ఐసీయూ బెడ్లు అన్న వివరాలు ఏమీ ఇవ్వకుండా కేవలం సింగిల్ పేజీలో రిపోర్టును పూర్తి చేసేవారు. దీంతో.. అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో బెడ్లు లేవన్న మాటతో కొందరు.. అపనమ్మకంతో మరికొందరు కార్పొరేట్ ఆసుపత్రుల వైపు పరుగులు తీయటంతో.. అక్కడ బెడ్లు దొరకని పరిస్థితి.

ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో పాజిటివ్ రోగులకు బెడ్ల కోసం పెద్ద ఎత్తున రికమండేషన్లు అవసరమవుతున్నాయి. బెడ్లు లేని ఆసుపత్రుల చుట్టూ విపరీతంగా తిరుగుతున్న ప్రజలు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు ఉన్నా పెద్దగా రావటం లేదన్న మాట వినిపిస్తోంది. అయితే.. దీనికి సంబంధించిన సమాచారం లేకనే.. ఇలా జరుగుతుందన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో గతానికి భిన్నంగా బులిటెన్ ను ఒక్క ఒక్కపేజీలో ముగించకుండా.. కొన్ని అదనపు వివరాలు ఇస్తున్నారు.

శుక్రవారం రాత్రి విడుదల చేసిన బులిటెన్ ను చూస్తే.. రాష్ట్రంలో ఐసోలేషన్ బెడ్లు 11,102 ఖాళీగా ఉన్నాయని.. ఆక్సిజన్ బెడ్లు 3021.. ఐసీయూ బెడ్లు 1340 ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక్క గాంధీలోనే 1087 బెడ్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. గాంధీలో మొత్తం 1890 బెడ్లు ఉండగా.. అందులో ఐసీయూలో 125 మంది.. ఆక్సిజన్ బెడ్ల అవసరం ఉన్న వారు 319 మంది.. వార్డుల్లో 359 మంది.. మొత్తంగా 803 మంది చికిత్స పొందుతుంటే.. ఖాళీగా 1087 బెడ్లు ఉన్నట్లు బులిటెన్ స్పష్టం చేసింది. తాజాగా విడుదలైన గణాంకాల్ని చూస్తే బెడ్ల కొరత తెలంగాణలో అసలే లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లే.